కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి ముందుకు సాగాలి: మహేష్ కుమార్ గౌడ్

by Ajay Maddhiboyina |

దేశ వ్యాప్తంగా లౌకిక, ప్రజాస్వామిక భారతదేశాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి ముందుకు సాగాలని టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు.

కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి ముందుకు సాగాలి: మహేష్ కుమార్ గౌడ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ వ్యాప్తంగా లౌకిక, ప్రజాస్వామిక భారతదేశాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి ముందుకు సాగాలని టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీల అనుబంధం విడదీయరానిదని, ఇది భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగిస్తూ ముందుకు సాగాలని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని ఆయన కోరారు. హైదరాబాద్ హిమాయత్ నగర్​లో పునర్ నిర్మితమైన సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూం భవన్ ప్రారంభోత్సవ సభ గురువారం జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సభలో టీ పీసీసీ చీఫ్​మహేష్ సందేశమిస్తూ గతంలో 1976 లో జరిగిన మగ్ధూంభవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాడు కాంగ్రెస్ మంత్రులు పాల్గొన్నారని, ప్రస్తుతం పునర్ నిర్మిత మగ్ధూం భవన్ ప్రారంభోత్సవంలో తాను పాల్గొన్నానని మహేష్ కుమార్ గుర్తు చేసుకున్నారు. మఖ్ధూం మొహియుద్దీన్ తన జీవితాంతం ప్రజల కోసమే పనిచేశారని కొనియాడారు. ప్రజా భవనాలు, కమ్యూనిస్టు ఆస్తులు ప్రజలకు ఉపయోగపడేవన్నారు. కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టులు కూడా బలపడాలని కోరుకునే వ్యక్తిని తాను అన్నారు. కమ్యూనిస్టు భావజాలానికి మరణం లేదని అటు సిద్ధాంతాలకు కొదవలేదని, నాయకత్వం వస్తూనే ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో శాసనససభ ఎన్నికల్లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలయికను ప్రజలు కూడా విశ్వసించారని చెప్పారు.

లౌకికవాదమంటే అర్భన్ నక్సలైట్ ముద్ర వేస్తున్నారు. దేశం బలపడి, మరింత ముందుకు సాగాలంటే లౌకికవాద శక్తులు బలపడాలని మహేష్ అన్నారు. దేశాన్ని పాలిస్తున్న ఫాసిస్టు ప్రభుత్వం లౌకికవాదం అంటే అర్బన్ నక్సలైట్లుగా, ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడితే దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాల్పులు జరుపుతోందని విమర్శించారు. దీనికి సంబంధించిన చర్చలలో తాను పాల్గొంటే, తనను కూడా అర్బన్ నక్సలైట్ చిత్రీకరిస్తున్నారన్నారు. అడవులో ఉన్న విలువైన ఖనిజ సంపదను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టేందుకు నరమేధానికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. తాను కూడా హిందూవునేనని, కానీ హిందూవు కార్డును ఉపయోగించుకోబోనని, కానీ కొందరు మేధావులు కూడా హిందూవు కార్డులను వాడుకోవడం దురదృష్టకరమన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినప్పటికీ కష్టనష్టాలను అధిగమిస్తూ తాము ముందుకు సాగుతున్నామన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు వెళున్నామని, మరింత చేయాల్సి ఉందని, ఇందుకు కమ్యూనిస్టుల సహకారం కావాలని కోరారు. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు కాంగ్రెస్, సిఎం రేవంత్ సహకరిస్తారన్నారు. డి.రాజా, సురవరం సుధాకర్ రెడ్డి జీవితాలు తమకు స్ఫూర్తి దాయకమని, వారు తమ జీవితం మొత్తం ప్రజలకు త్యాగం చేశారని మహేష్ కొనియాడారు. కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వేర్వేరుగా ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ, జాతీయ, లౌకికవాదం, ప్రజాస్వామ్యవాదం విషయంలో జాతీయ స్థాయిలో అందరూ కలిసి ముందుకు సాగుతామని అన్నారు. బిజెపి ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు రాజ్యాంగబద్ధ సంస్థలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని న్యాయవ్యవస్థను కాపాడాలని మహేష్ కుమార్ గౌడ్ కోరారు.

పేదల పక్షంగా.. నిరసనలకు వేదికగా ‘మఖ్ధూంభవన్’: సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ

సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ బీఆర్​ఎస్​అధినేత కేసీఆర్​పాలనలో ధర్నాలు నిషేధించారని, ఇందిరాపార్క్ ధర్నాచౌక్ ఎత్తివేసి, అనేక నిర్భాంధాలు విధిస్తే, అన్ని రాజకీయ పార్టీలకు ‘మఖ్ధూం భవన్’ నిరసనలకు వేదికగా మారిందని గుర్తు చేశారు. లౌకిక, ప్రజాస్వామ్య, వామపక్షవాదులు ఒక వేదిక మీదకు వచ్చారన్నారు. మావోయిస్టులు కాల్పులను విరమించిన తర్వాత కూడా ‘ఆపరేషన్ కాగర్’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా యుద్దం ప్రకటించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఏకపక్ష యుద్ధం ప్రకటించడాన్ని నారాయణ ఖండించారు. మనుషులను,నక్సలైట్లను కేంద్ర ప్రభుత్వం చంపవచ్చని, కానీ నక్సలిజాన్ని మాత్రం చంపలేరని స్పష్టం చేశారు.

మావోలతో శాంతి పూర్వక దిశగా చర్చలు జరపాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులతో ప్రభుత్వం శాంతిపూర్వక చర్చలు నిర్వహిస్తే, దేశానికి ఒక మంచి సందేశాన్ని పంపించినట్టుగా ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఈ మేరకు టీ పీసీసీ చీఫ్​మహేష్ కుమార్ కు సూచించారు. ఏమాత్రం అవకాశం ఉన్న ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపడం లేదని మండిపడ్డారు. ఎర్రజెండాలన్నీ ఒక్కటైతే కమ్యూనిస్టులకు ఎదురే ఉండబోదని చెప్పారు. వందేళ్లు అయినా కమ్యూనిస్టు పార్టీ మరింత పెరగడమే తప్ప తగ్గిందిలేదని కమ్యూనిస్టు నాయకులు నాలుగవ తరం కూడా వచ్చిందన్నారు. ‘మగ్ధూంభవన్’ అనేది ఒక వారసత్వం లాంటిదని, కమ్యూనిస్టులకు ఇదే తాజ్ చార్మినార్ అన్నారు. పెద్దలు నిర్మించిన భవనంలో పురావాస్తు లాంటి జ్ఞాపకాలు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ భవనాన్ని పునర్ నిర్మితం చేశామని కూనంనేని వివరించారు. మగ్దూంభవన్ పునర్ నిర్మితం పూర్తికావడంతో కమ్యూనిస్టు నాయకులు రాజ్ బహదూర్ గౌర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఇందుకు సహాయ సహకారాలు అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ కలిసి కోరినట్లు తెలిపారు. అదేవిధంగా ఇందకు సహకరించాలని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నమన్నారు.

సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లి మాట్లాడుతూ: పేద, ధనిక, కుల,మత,స్త్రీ,పురుష అసమానతలు లేని, సమాజ నిర్మాణానికి , సోషలిస్టు బావాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో దోపిడీ వర్గాలకు కమ్యూనిస్టులు, కమ్యూనిస్టు బావాలు కలిగిన వారే ప్రత్యామ్నాయం అవుతారని తెలిపారు. ఆ దిశగా ప్రత్యామ్నాయ ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. మతోన్మాద, హిందూత్వ ఏజెండా పేరుతో కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన బిజెపి దోపిడీ వ్యవస్థకు,బావజలానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులను కలుపుకుని పోరాటం చేయాలని సూచించారు. బిజెపిని గద్దె దించేందుకు అందరూ కలిసి ముందుకు సాగాలన్నారు.

Next Story