గ్రామ పంచాయతీలకు ఇక మహర్దశ.. నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

by Kema Shiva Kumar |

రాష్ట్రంలోని పంచాయతీలు కొత్త శోభను అలంకరించుకోనున్నాయి.

గ్రామ పంచాయతీలకు ఇక మహర్దశ.. నిధుల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని పంచాయతీలు మహర్దశ పట్టబోతోంది. ఇంతకాలం నిలిచిపోయిన ఫైనాన్స్ కమిషన్ నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లుగా తెలుస్తున్నది. రెండేళ్ల క్రితం వరకు ఇచ్చిన నిధుల ఖర్చుల వివరాలు సమర్పించాలని కోరినట్లు తెలిసింది. దీనితో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు కేంద్రం ఆడిగిన సమాచారాన్ని పంపే పనిలో బిజీగా ఉన్నారు. రెండు మూడు రోజుల్లో ఆ వివరాలు పంపే ప్రక్రియ పూర్తవుతుందని, ఈ నెలాఖరు నాటికి పంచాయతీలకు కేంద్ర నిధులు అందుతాయని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వెల్లడించారు. ఇంతకాలం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో దాదాపు రూ.3 వేల కోట్ల కేంద్ర నిధులు పెండింగ్‌లో పడ్డాయి. ఈ మధ్య సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ పూర్తయి కొత్త పాలకవర్గాలు ఏర్పడటంతో నిధులు ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. దీనితో పెండింగ్ నిధులను దశల వారీగా నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్స్‌లోకి జమ చేసేందుకు కేంద్రం ఓకే చెప్పింది.

ఇక చకచకా పనులు

ఇంతకాలం కేంద్రం నుంచి నిధులు నిలిచిపోవడంతో గ్రామాల్లో చాలా పనులు పెండింగ్‌లో పడ్డాయి. పారిశుధ్యం, లైటింగ్ ఏర్పాట్లు, జీతాలు చెల్లింపుల కోసం స్పెషల్ ఆఫీసర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లు అప్పులు చేసి గ్రామానికి కావాల్సిన అవసరాలు తీర్చేవారు. ఇప్పుడు కేంద్రం నుంచి నిధుల విడుదలకు అడ్డంకులు తొలగిపోవడంతో ప్రతినెలా గ్రామాలకు కావాల్సిన ఖర్చులకు ఇబ్బందులు ఉండవని అధికారులు ఆశిస్తున్నారు.

మాజీ సర్పంచుల బకాయిలు?

బీఆర్ఎస్ హయాంలో సర్పంచులు సొంత నిధులతో గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేశారు. ఈలోపే సర్కారు మారడం, సర్పంచుల పదవీకాలం ముగియడంతో ఆ పనులకు బిల్లులు ఇప్పటివరకు చెల్లించలేదు. పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయాలని మాజీ సర్పంచులు పలుసార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు కొత్త పాలక వర్గాలు రావడం, కేంద్రం నుంచి ఫండ్స్ రిలీజ్‌కు క్లియరెన్స్ రావడంతో ప్రభుత్వం తమ పెండింగ్ బిల్లులు చెల్లిస్తుందనే ఆశలో మాజీ సర్పంచులు ఉన్నారు.

Next Story