జూరాల నుంచి కాకుండా కృష్ణ నీళ్లను 'పాలమూరు'కు ఎందుకు మళ్లించాలనుకున్నావు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

by Ratna Kumari |

జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని మళ్లిస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంతటా పచ్చబడతదని అన్న నీవు, శ్రీశైలం బ్యాక్ వాటర్ ను పాలమూరు ప్రాజెక్టు కు ఎందుకు మళ్లించాలనుకున్నావని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూటిగా కేసీఆర్ ను ప్రశ్నించారు.

జూరాల నుంచి కాకుండా కృష్ణ నీళ్లను పాలమూరుకు ఎందుకు మళ్లించాలనుకున్నావు :  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని మళ్లిస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంతటా పచ్చబడతదని అన్న నీవు, శ్రీశైలం బ్యాక్ వాటర్ ను పాలమూరు ప్రాజెక్టు కు ఎందుకు మళ్లించాలనుకున్నావని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూటిగా కేసీఆర్ ను ప్రశ్నించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు వలసల జిల్లా అని, జూరాల మన భూభాగంలో ఉంది ఆ నీటిని మళ్లిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చబడతదని ఆనాడే అన్న నీవు, ఎవరి ప్రయోజనాల కోసం శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి పాలమూరు ప్రాజెక్టు కు తీసుకోవాలనే ఆలోచన వచ్చిందని ఆయన ప్రశ్నించారు. పదేళ్ల పాలనలో ఒక్క బొటు నీటిని పాలమూరు బీళ్లకు పారించకుండా, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి, నీటి కేటాయింపులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నావని ఆయన కేటీఆర్ పై తీవ్రంగా మండిపడ్డారు. ప్రతి వర్షాకాలం జూరాల నిండుతుందని, వాటిని ఉమ్మడి జిల్లాకు ఎందుకు మలుపుకోలేదని ప్రశ్నిస్తూ, శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకుంటే రాయలసీమ కు నీటిని మళ్లించవచ్చనే ఆలోచనతో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి కి పాలమూరు నీటిని అమ్ముకున్నావని ఆయన తీవ్రంగా ఆరోపించారు. పదేళ్ల పాలనలో జిల్లాకు ఒక్క ప్రాజెక్టు కట్టకుండా జిల్లాను ఎండబెట్టింది నీవు కాదా అని ఆయన నిలదీశారు. పవర్ లో ఉన్నప్పుడు గుర్తుకు రాని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, పదవి పోయినాక పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల లోపు పాలమూరు యూనివర్సిటీ కి భారీగా నిధులు కేటాయించామని, ఇంజనీరింగ్, లా, ఐఐఐటీ కళాశాల లను తెచ్చామని, మహబూబ్ నగర్ మున్సిపాల్టీ ని కార్పోరేషన్ గా మార్చామని, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు సాగుతున్నాయని ఆయన వివరించారు.

నగరం నడిబొడ్డున చికెన్,మటన్ మార్కెట్లు అవసరమా

మహబూబ్ నగర్ పట్టణ నడిబొడ్డున చికెన్, మటన్, చేపల మార్కెట్ ఉండాలా,లేక విద్యాలయం ఉండాలా అని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఆర్ అండ్ బి అతిథి గృహం, డైట్ కాలేజీ ప్రాంగణంలో మాహాంసార మార్కెట్లను పెట్టడాన్ని ఆయన ఆక్షేపించారు. అక్కడ విద్యకు సంబంధించిన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను పెట్టి విద్యా హబ్ గా మార్చాలనే ఆలోచన చేయకుండా విద్యను నాశనం చేశారని ఆయన విమర్శించారు. నగరానికి దూరంగా ఉండాల్సిన హాస్పిటల్ ను, ఎంతో బలంగా ఉన్న పాత కలెక్టరేట్ ను కూల్చి హాస్పిటల్ నిర్మించావని, పట్టణ నడిబోడ్డన ఉండాల్సిన కలెక్టర్ కార్యాలయాన్ని పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న నీ ఫాం హౌస్ డెవలప్మెంట్ కోసం నిర్మించావని ఆయన ఎత్తి పొడిచారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 50 స్థానాలు కైవసం చేసుకుంటుందని, బీఆర్ఎస్ 5 స్థానాలకే పరిమితమవుతుందని ఆయన జోస్యం చెప్పారు. మహబూబ్ నగరం జ్ఞాన సంపద, నీటి సంపద, విద్యా సంపదను సృష్టించి, మహానగరం గా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ ఒబెదుల్లా కొత్వాల్,ముడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ బెక్కెరి అనిత, మారెపల్లి సురేందర్ రెడ్డి, సిరాజ్ ఖాద్రీ, సిజె బెనహర్, తదితరులు పాల్గొన్నారు.

Next Story