- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇసుక అక్రమ రవాణా ఆపేదెవరు..?
ఎవరికీ అందిన కాడికి వాళ్లు దోచుకోవడమే అన్నట్టు సాగిపోతోంది. మండల పరిధిలోని సహజ వనరుల దోపిడి దందాను అడ్డుకునే నాథుడే లేకుండా పోయారని స్థానికులు పేర్కొంటున్నారు.

దిశ, మిడ్జిల్ : ఎవరికీ అందిన కాడికి వాళ్లు దోచుకోవడమే అన్నట్టు సాగిపోతోంది. మండల పరిధిలోని సహజ వనరుల దోపిడి దందాను అడ్డుకునే నాథుడే లేకుండా పోయారని స్థానికులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఇసుక అక్రమ రవాణా, అలాగే మట్టి రవాణా విచ్ఛలవిడిగా పెరిగిపోతోంది. మిడ్జిల్ మండలంలోని దుందుబి వాగు నది పరివాహక ప్రాంతం కేఎల్ఐ కాలువ సమీపంలో అక్రమ దందాలు యదేచ్ఛగా కొనసాగుతున్నాయి. మండల కేంద్రంతో పాటు కొత్తూరు, చిల్వేర్, కొత్తపల్లి, వాడ్యాల, మున్ననూర్ గ్రామాల నుంచి పగలు, రాత్రి అనే తేడా లేకుండా ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా జోరుగా అక్రమ ఇసుక రవాణా దందా కొనసాగుతోంది.
కాసులకు కక్కుర్తి పడి ఈ అక్రమ దందా రోజు రోజుకు పెరిగిపోతున్నట్టు సమాచారం. ఈ దందాతో స్థానిక సంస్థలకు, ప్రభుత్వానికి భారీగానే నష్టం వాటిల్లుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. పట్టపగలే సహజ వనరులను దోచుకుంటున్నారు. అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. గత కొద్ది రోజులుగా ఇసుక దందా మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్న చందంలా కొనసాగుతోంది. ఎక్కువగా రాత్రి సమయంలో ట్రాక్టర్ల ద్వారా వ్యవసాయ పొలాల్లో డంపింగ్ చేసి.. టిప్పర్ల ద్వారా ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. వాగు నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమంగా రవాణా చేస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం పట్టీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది.
కొంత మంది అధికారుల అండతో ఇసుక రవాణా జోరుగా సాగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పర్మిషన్ లేకున్నా ఇసుకను తరలిస్తున్నారని ప్రశ్నిస్తే.. అధికారుల అండదండలు ఉన్నాయని, ఇష్టం ఉన్నచోట చెప్పుకోండి అంటూ ఎదురు దాడికి దిగుతున్న సందర్భాలు ఉన్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ , పోలీస్ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేకపోవడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. పట్టపగలే అతివేగంతో ట్రాక్టర్లు రోడ్లపై ప్రయాణిస్తుంటే ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇసుక దందాకు అధికారులు సహకరిస్తున్నారని ప్రజలు బాహటంగానే చర్చించుకుంటున్నారు. ఎవరైనా అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసిన అధికారులు, పోలీసులు చూసీచూడట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఇసుక రవాణాకు సహకరిస్తున్న అధికారులపై విచారణ చేసి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






