పేదవాడి ఆకలి తీర్చే చోట 'అతుకుల బతుకు'

by Nallavelli.Anjaneyulu |

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ నడిబొడ్డున ప్రతిరోజూ వందలాది మంది పేదల ఆకలి తీరుస్తున్న 'అక్షయ పాత్రస ( రూ.5 కే భోజన కేంద్రం) ప్రస్తుతం కొందరి నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.

పేదవాడి ఆకలి తీర్చే చోట అతుకుల బతుకు
X

దిశ, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ నడిబొడ్డున ప్రతిరోజూ వందలాది మంది పేదల ఆకలి తీరుస్తున్న 'అక్షయ పాత్రస ( రూ.5 కే భోజన కేంద్రం) ప్రస్తుతం కొందరి నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఆకలితో వచ్చే అభాగ్యులకు అన్నం పెడుతున్న ఈ కేంద్రం, కనీస వసతులు లేక 'ఆతుకుల టెంట్' కిందనే కొనసాగుతుండటం పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూలీలు, రోగుల బంధువులు, గ్రామాల నుంచి పనుల నిమిత్తం మహబూబ్ నగర్ పట్టణానికి వచ్చే సామాన్య ప్రజలు.. ఇలా ప్రతిరోజూ వందలాది మంది ఇక్కడ అన్నం కోసం క్యూ కడుతుంటారు. కేవలం రూ.5కే కడుపునిండా నాణ్యమైన భోజనం దొరుకుతుందనే ఆశతో వచ్చే వారికి, ఇక్కడ నెలకొన్న దుర్భర పరిస్థితులు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయి. ఎప్పుడో వేసిన, పూర్తిగా చిరిగిపోయి, అతుకులు పెట్టిన పాత టెంట్ కిందనే ఎండకు ఎండుతూ, దుమ్ము ధూళి మధ్య కూర్చుని భోజనం చేయాల్సిన దుస్థితి సామాన్యుడికి దాపురించింది.

ఎండలు ముదురుతుండటంతో ఆ టెంటు కింద కూర్చోవడం నరకప్రాయంగా మారుతుండగా.. వానాకాలం వస్తే ఆ చిరిగిన రంధ్రాల గుండా పడే వర్షపు చినుకుల మధ్య కనీసం నిలబడటానికి కూడా చోటు ఉండని పరిస్థితి నెలకొంది. అన్నం పెట్టే చోట కనీసం నీడ, ప్రశాంతంగా కూర్చునే వసతి, దాహం తీర్చుకోవడానికి తాగునీరు లేకపోవడం మానవత్వానికే మచ్చగా మారుతోంది. "అక్షయ పాత్ర ద్వారా అన్నం పెడుతున్నా.. కనీసం మనిషిలా కూర్చుని తినే ఆత్మగౌరవం దక్కడం లేదు" అని ఇక్కడికి వచ్చే ప్రజలు బహిరంగంగానే వాపోతున్నారు. ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి, ఈ అతుకుల టెంట్ ను తొలగించి, పేదలకు గౌరవప్రదంగా భోజనం చేసేలా శాశ్వత షెడ్డును, తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story