- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్రంగుడ్డ గండాలు గట్టెక్కేదెన్నడు?
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలంలోని దివిసీమ గుర్రంగడ్డ గ్రామం కృష్ణానది వరదలతో జలదిగ్బంధంలోకి వెళ్లిపోతుంది.

దిశ, గద్వాల రూరల్: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలంలోని దివిసీమ గుర్రంగడ్డ గ్రామం కృష్ణానది వరదలతో జలదిగ్బంధంలోకి వెళ్లిపోతుంది. రెండు వేల ఎకరాలకు పైగా విస్తీర్ణం, వెయ్యికిపైగా ఎకరాల్లో పంటల సాగు, వెయ్యి మంది జనాభా, 60 మంది విద్యార్థులున్న ఈ గ్రామం నలువైపులా కృష్ణానదిచే ఆవరించబడి ఉంటుంది. ప్రస్తుతం వారం రోజులుగా వరదలతో ఈ గ్రామం బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతోంది.
ఏరు దాటితేనే మరో ఊరు..
గుర్రంగడ్డ వాసులు మరో ఊరికి వెళ్లాలంటే ఏకంగా ఏరు దాటాలి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామంలో కేవలం ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉండటంతో, ఆపై విద్య కోసం 30 మందికి పైగా విద్యార్థులు పెబ్బేరు, వనపర్తి తదితర ప్రాంతాలకు వెళ్లి బంధువుల ఇళ్లలో ఉండి చదువుకుంటున్నారు. ఏరు పోటెత్తితే వీరంతా ప్రమాదకర మరబోటులో ప్రయాణించాల్సి వస్తుంది. కనీసం లైఫ్ జాకెట్లు కూడా అందుబాటులో ఉండవు. వర్షాకాలంలో లేదా నది ఉప్పొంగినప్పుడు ఈ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి.
వంతెన నిర్మాణం నత్తనడక..
గ్రామానికి ఉత్తరం వైపు చేపట్టిన వంతెన నిర్మాణం పూర్తయితే ఈ గ్రామస్థుల కష్టాలు తీరుతాయి. అయితే, కాంట్రాక్టర్ల అలసత్వమో, బిల్లులు మంజూరు కాకపోవడమో తెలియదు కానీ, ఈ వంతెన నిర్మాణం ఏళ్లుగా నత్తనడకన సాగుతోంది. దీంతో గద్వాల మండలంలోని గుర్రంగడ్డ దీవి కష్టాల కడలిని ఈదుతూనే ఉంది.
హామీలు నీటి మూటలే..
దివిగ్రామం నుంచి పెబ్బేరు వైపు ప్రారంభించిన వంతెన నిర్మాణం పూర్తిచేస్తామని పాలకులు గతంలో ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. గుర్రంగడ్డ దీవిలో వెయ్యి ఎకరాల్లో నీటి ఆధారిత, 350 ఎకరాల్లో వర్షాధార పంటలను సాగుచేస్తున్నారు. పాఠశాల, ఆసుపత్రికి వెళ్లాలన్నా, రేషన్ సరకులు తెచ్చుకోవాలన్నా నదిని దాటాల్సిందే. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బోటులో ప్రయాణాలు సాగిస్తున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నెరవేరని హామీలు, మందకొడి పనులు..
2018లో అప్పటి సీఎం కేసీఆర్ ఆరు నెలల్లో వంతెన నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించినప్పటికీ, ఏడాది వరకు పనులు ప్రారంభమే కాలేదు. 2019లో పనులు ప్రారంభించినప్పటికీ, గుత్తేదారు 15 పిల్లర్లు మాత్రమే వేసి వదిలేశారు. వరద వచ్చే సమయంలో పనులు ప్రారంభించడం, వరద సాకు చూపించి నిలిపివేయడం ఇలా వంతెన నిర్మాణం కాస్తా నత్తనడకన సాగుతోంది. దీనిపై గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టి సారించి వెంటనే వంతెన నిర్మాణం పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే తమ పిల్లలు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని, వారి భవిష్యత్తు బాగుంటుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
60 శాతం పనులు పూర్తయ్యాయి..
"వంతెన నిర్మాణ పనులు ఇప్పటివరకు 60శాతం పూర్తయ్యాయి. రూ.11 కోట్ల అంచనా వ్యయంతో వంతెనను నిర్మిస్తున్నారు. గుత్తేదారుకి సకాలంలో బిల్లులు రాకపోవడం వల్ల వంతెన నిర్మాణం ఆలస్యమైంది. మొత్తం 32 పిల్లర్లలో 16 పిల్లర్లు పూర్తిస్థాయిలో పూర్తయ్యాయి. వరద ఉధృతి పూర్తిగా తగ్గాక పనులు మొదలుపెడతాం" .
–ఇరిగేషన్ డీఈ ఎల్లయ్య






