- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సఖి కేంద్రంలో ఏం జరుగుతోంది..?
బాధితులకు ఆశ్రయం, భద్రత కల్పించాల్సిన సఖి కేంద్రం గద్వాలలో ఇప్పుడు నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది.

దిశ, గద్వాల క్రైం : బాధితులకు ఆశ్రయం, భద్రత కల్పించాల్సిన సఖి కేంద్రం గద్వాలలో ఇప్పుడు నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. రక్షణ కల్పించాల్సిన కేంద్రం నుంచే బాధితురాలు గోడ దూకి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే, అక్కడ భద్రత ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
కేసు నమోదు.. సఖికి అప్పగింత.. మళ్ళీ అదృశ్యం!
గట్టు మండలానికి చెందిన ఓ మహిళ గతంలో అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలిని గుర్తించి, రక్షణగా ఉంటుందనే ఉద్దేశంతో ఆమెను గత నెల చివరలో సఖి కేంద్రానికి అప్పగించారు. కానీ, సఖి కేంద్రం సిబ్బంది భరోసా కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. సిబ్బంది నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా సదరు మహిళ ఈ నెల 1న కేంద్రం నుంచి గోడ దూకి అదృశ్యం కావడం జిల్లాలో ఇప్పుడు సంచలనం రేపుతోంది.
పాత రోతలే.. మళ్ళీ మొదలయ్యాయా..?
గతంలో ఇదే సఖి కేంద్రంలో సిబ్బంది పార్టీలు నిర్వహించారన్న ఆరోపణలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లోపించడం, బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించడం వల్లే ఇలాంటి అరాచకాలు పునరావృతమవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆశ్రయం కోసం వస్తే, నిర్బంధం మరియు భద్రతా లోపాలతో బాధితులు గోడలు దూకే పరిస్థితి రావడం వ్యవస్థ వైఫల్యమేనని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల వివరణ.. నోటీసులకే పరిమితమా?
ఈ ఘటనపై జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సునందను వివరణ కోరగా.. ఘటనకు బాధ్యులైన సిబ్బందికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. అదృశ్యమైన మహిళ ఆచూకీ కోసం పోలీసులకు సమాచారం ఇచ్చామని, ఇకముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మహిళ అదృశ్యంపై గద్వాల పట్టణ ఎస్సై కల్యాణ్ కుమార్ స్పందిస్తూ.. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. అదృశ్యమైన మహిళ ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశామని, మరో రెండు రోజుల్లో ఆమెను సురక్షితంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఏది ఏమైనా, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని కేంద్రం నిర్వహణను ప్రక్షాళన చేయాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






