- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యుద్దం వలన మానవ మనుగడకు ముప్పు : ప్రొఫెసర్ హరగోపాల్
ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం వలన మానవుని మనుగడకు ముప్పు వాటిల్లుతుందని, మౌనం వహిస్తున్న ప్రపంచ దేశాలు యుద్ధాన్ని ఆపేందుకు చొరవ తీసుకోవాలని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం వలన మానవుని మనుగడకు ముప్పు వాటిల్లుతుందని, మౌనం వహిస్తున్న ప్రపంచ దేశాలు యుద్ధాన్ని ఆపేందుకు చొరవ తీసుకోవాలని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివారం స్థానిక పారిశ్రామిక వాడలోని సీనియర్ సిటిజన్ ఫోరం కార్యాలయంలో పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం, ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ దురాక్రమణ యుద్దాన్ని వ్యతిరేకిస్తూ ఏ. తిమ్మప్ప, వెంకట్రాములు అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మానవ చరిత్రలో అమెరికా నిర్మాణమే ఒక దుర్మార్గమైన ఆలోచనతో నిర్మితమైనదని, ఈ యుద్ధంతో ప్రపంచ దేశాలు తామంటే భయంతో ఉండాలని సంకేతం కోసం చేస్తున్నట్లుగా ఉందని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. ఇస్లాం దేశాలు ఐక్యంగా ఉంటే పరిస్ధితులు మరోలా ఉండేదని, ఖనిజ వనరులు కోసం చేస్తున్న ఈ విధ్వంసాన్ని సృష్టించి, పసిపిల్లలు ,మహిళలను బలి తీసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇరాన్ టెర్రరిజాన్ని పోషిస్తుందని ఆరోపిస్తూ యుద్దం చేయడం, అమాయకులను చంపడం ఒక టెర్రరిజమే కదా అని ఆయన విమర్శించారు. నేడు దేశం ఎదుర్కొంటున్న వనరులు, ఇంధనం, ఆర్థిక సంక్షోభానికి అమెరికా సామ్రాజ్యవాదమే కారణమని ఆరోపించారు. యుద్ధం ఆపేందుకు ఇలాంటి సదస్సులు జిల్లాలో, రాష్ట్రాల్లో, దేశంలో జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పత్రికా రచయిత కల్లూరి భాస్కరం కీలక ఉపన్యాసం ఇచ్చారు. అంతకుముందు స్కైబాబ, ప్రో.జి విజయ్, శాంతన్న, ఎం.రాఘవాచారి, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కే.సీ వెంకటేశ్వర్లు, తిమ్మప్ప పాల్గొన్నారు.






