ఓటరన్నా.. మజాకా!

by I. Sairam |

మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో రాజకీయం రసవత్తరంగా మారింది.

ఓటరన్నా.. మజాకా!
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. గెలుపు గుర్రం ఎక్కేందుకు అభ్యర్థులు శతవిధాల ప్రయత్నిస్తుండగా, ఓటర్లు మాత్రం అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రచారానికి ఎవరు వచ్చినా, "మా ఓటు మీకే" అంటూ తల ఊపుతున్న ఓటర్లు.. లోలోపల మాత్రం ఎవరికి వేయాలో ముందే డిసైడ్ అయిపోయినట్లు కనిపిస్తున్నారు. దీంతో ఓటరు నాడి అందక అభ్యర్థులు, ప్రధాన పార్టీల నాయకులు తలలు పట్టుకుంటున్నారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్‌తో పాటు 18 మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది.

ఎవరు వచ్చినా 'జై'.. కండువా మారిస్తే 'పైసల్'!..

ఎన్నికల పుణ్యమా అని వార్డుల్లోని మహిళలు, వృద్ధులకు గిరాకీ పెరిగింది. ప్రచారానికి వెళ్తే చాలు చేతినిండా డబ్బులు వస్తుండటంతో జనం కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం ఒక పార్టీ కండువా కప్పుకుని నినాదాలు చేసిన వారే, సాయంత్రం మరో పార్టీ నేతలు రాగానే కండువా మార్చేస్తున్నారు. ఇలా పార్టీలు మార్చి ప్రచారం చేసినందుకు ఒక్కొక్కరు రోజుకు రూ. 600 నుండి రూ. 1200 వరకు సంపాదిస్తున్నారు. ఎవరు వచ్చినా 'జై' అనడం ఓటర్లకు అలవాటుగా మారింది.

ఆచి తూచి అడుగులు.. గంపగుత్తా ఒప్పందాలు

ఎన్నికల ఖర్చు విషయంలో అభ్యర్థులు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. కేవలం వ్యక్తిగత ప్రచారంపైనే కాకుండా, కులాలు, మతాల వారీగా ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. కమ్యూనిటీ హాళ్లు, దేవాలయాల నిర్మాణాలకు విరాళాలు ఇస్తామని 'డీల్స్' కుదుర్చుకుంటున్నారు. ప్రచారానికి వచ్చే వారికి నిత్యం విందులు, మందులు ఏర్పాటు చేస్తూ ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇంత చేస్తున్నా ఓటు పడుతుందో లేదో అన్న సందేహం అభ్యర్థులను వెంటాడుతోంది.

ముఖ్య నేతలకు అగ్నిపరీక్ష..

ఈ ఎన్నికలు కేవలం వార్డు అభ్యర్థులకే కాదు, జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. తమ క్యాడర్‌ను గెలిపించుకోలేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భావిస్తున్న ముఖ్య నేతలు స్వయంగా రంగంలోకి దిగి చెమటోడుస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మూడు ప్రధాన పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగుతుండటంతో పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు.

చివరి 'రెండు' రోజులే టార్గెట్!..

ప్రస్తుతం ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ, అభ్యర్థుల అసలు నమ్మకమంతా చివరి రెండు రోజుల పైనే ఉంది. వార్డుల్లో ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటూ, ఎక్కడ తక్కువగా ఉన్నామో తెలుసుకుంటున్నారు. ప్రచారంతో మైలేజ్ రాకపోతే, చివరి 48 గంటల్లో భారీగా డబ్బు, మద్యం పంపిణీ చేసి ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని అభ్యర్థులు భారీ స్కెచ్ వేశారు. ఓటరు కనికరం కోసం నేతలు పడుతున్న ఈ తపన చివరకు ఎవరిని కుర్చీలో కూర్చోబెడుతుందో వేచి చూడాలి.

Next Story