- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. పొంచి ఉన్న ప్రమాదం..!
వీర్లపల్లి గ్రామంలో ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు రైతుల ప్రాణాలను హరించే స్థితిలో ఉన్నాయి. ఈ తీరుపై సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, జడ్చర్ల : వీర్లపల్లి గ్రామంలో ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు రైతుల ప్రాణాలను హరించే స్థితిలో ఉన్నాయి. ఈ తీరుపై సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామానికి చెందిన రైతు జలంధర్ రెడ్డి వ్యవసాయ పొలంలో నాట్లు వేసే సమయంలో చేతితో అందే ఎత్తులో విద్యుత్ తీగలు వేలాడుతున్నాయని వాపోతున్నారు. స్తంభాల మధ్య దూరం ఎక్కువగా ఉండడం, పాత స్తంభాలు శిథిలావస్థకు చేరడం వల్ల ఎప్పుడెప్పుడు కూలిపోతాయో అన్న భయం రైతుల్లో నెలకొంది. దాంతో ప్రతి పనికి ముందుగా ట్రాన్స్ఫార్మర్‌ను ఆఫ్ చేసి వ్యవసాయ పనులు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు.
గాలులు వీస్తున్న సమయంలో తీగలు ఒకదానికొకటి తగలడంతో షార్ట్ సర్క్యూట్‌లు జరుగుతున్నాయని, కొన్నిసార్లు తీగలు తెగి నేలపై పడుతున్నాయని రైతులు తెలిపారు. గతంలో ఇదే పొలంలో విద్యుత్ తీగల వల్ల రెండు మూగజీవాలు మృతిచెందాయని గుర్తుచేశారు.
"నాలుగు సంవత్సరాలుగా ఫిర్యాదు చేస్తున్నా స్పందన లేదు"
రైతు జలంధర్ రెడ్డి మాట్లాడుతూ, గత నాలుగు సంవత్సరాలుగా ఈ సమస్యను విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నానని, కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. పాత స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని, తీగల ఎత్తును పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు, మూగజీవాలు ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతోందన్నారు.
గ్రామంలో ఇతర ప్రాంతాల్లో కూడా విద్యుత్ తీగలు అత్యంత తక్కువ ఎత్తులో వేలాడుతుండటంతో ఎత్తైన వాహనాలు, ట్రాక్టర్లు వెళ్లే సమయంలో ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు చెప్పారు. హైటెన్షన్ లైన్లు కూడా కొన్ని చోట్ల సురక్షితంగా లేవని, వెంటనే చర్యలు తీసుకోకపోతే తీవ్ర ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.






