భర్తీ కాని నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లా అధ్యక్ష స్థానాలు

by Kodari Anjali |

అగ్రనేతలు కేటీఆర్, హరీశ్‌రావు ఇచ్చిన హామీలు ప్రకటనలకే పరిమితమవ్వడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

భర్తీ కాని నాగర్‌కర్నూల్, గద్వాల జిల్లా అధ్యక్ష స్థానాలు
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: ‘త్వరలోనే పూర్తిస్థాయి నాయకత్వాన్ని నియమిస్తాం.. మీకు అండగా ఉండేవారికి బాధ్యతలు అప్పగిస్తాం’ అని బీఆర్‌ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్‌రావు ఇచ్చిన హామీలు ప్రకటనలకే పరిమితమవ్వడంతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో ఇరు జిల్లాల్లో బీఆర్‌ఎస్ తీవ్ర నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది. నాయకత్వం వహించాల్సిన నేతలు వైదొలగడం, ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేయడంలో అధిష్టానం జాప్యం చేస్తుండటంతో స్థానిక నాయకులు, కార్యకర్తలు ఏం చేయాలో తోచక తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.

జంపింగులతో పెరిగిన ఖాళీలు..

జిల్లాల్లో పార్టీకి వెన్నుముకగా నిలవాల్సిన కీలక నేతలు వరుసగా పార్టీ వీడటంతో ఈ పరిస్థితి దాపురించింది. గద్వాల జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో అక్కడ జిల్లా అధ్యక్ష పదవితో పాటు గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి పోస్టు ఖాళీ అయింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరడంతో ఇక్కడ కూడా అధ్యక్ష పదవితో పాటు అచ్చంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పోస్టు ఖాళీ అయింది. ఈ ఇద్దరు నేతలు పార్టీ మారిన సందర్భంలో బీఆర్‌ఎస్ కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు కేటీఆర్, హరీశ్‌రావు నియోజకవర్గాల్లో పర్యటించారు. త్వరలోనే జిల్లా అధ్యక్షులతో పాటు పూర్తిస్థాయి ఇన్‌చార్జీలను నియమిస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఆ హామీలు ఇచ్చి నెలలు గడుస్తున్నా నేటికీ కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం.

ఇక్కడ ఇద్దరు... అక్కడ ఒక్కరు...

ప్రస్తుతం రెండు జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు నామ్‌కే వాస్తేగా సాగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గద్వాల నియోజకవర్గంలో బాసు హనుమంతు నాయుడు ఒక్కడే పార్టీ కార్యక్రమాలను తన భుజస్కంధాలపై వేసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, సరైన అధికారిక హోదా లేకపోవడంతో శ్రేణులను ఏకతాటిపైకి తేలేకపోతున్నారు. ఇక అచ్చంపేటకు నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి తాత్కాలికంగా ఇన్‌చార్జి బాధ్యతలు ఇచ్చారు. ఆయనతో పాటు రాష్ట్ర కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అప్పుడప్పుడు వచ్చి కార్యకర్తలకు ధైర్యం చెప్పి, అధికార పార్టీ విధానాలపై పోరాడాలని సూచించి వెళ్తున్నారు. అయితే, నియోజకవర్గంలో శాశ్వతంగా ఉండి నడిపించే నాయకుడు లేకపోవడంతో కార్యకర్తలు తీవ్ర నిరాశలో ఉన్నారు.

అధ్యక్షులను నియమిస్తే...

నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ చార్జీలను నియమించి బాధ్యతలు అప్పగిస్తే పార్టీ కార్యక్రమాలు బలోపేతం అవుతాయని పలువురు నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. నియోజకవర్గ ఇన్ చార్జీలు, జిల్లా అధ్యక్షులను ఎంపిక చేసి పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యతలు అప్పగించాలని పలువురు సూచిస్తున్నారు.

Next Story