- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తప్పుడు సర్వేలతో చెరువు మాయం..?
నోట్ల కట్టలకు ప్రభుత్వ భూమి ప్రైవేట్ అవుతుంది. సర్వే నెంబర్ మారుతుంది. చెరువు కబ్జా చేసి ఇళ్లు నిర్మిస్తున్నా కబ్జాదారులను రక్షించేందుకు సర్వేయర్ల డ్రామా లు కళ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయి.

దిశ, శేరిలింగంపల్లి : నోట్ల కట్టలకు ప్రభుత్వ భూమి ప్రైవేట్ అవుతుంది. సర్వే నెంబర్ మారుతుంది. చెరువు కబ్జా చేసి ఇళ్లు నిర్మిస్తున్నా కబ్జాదారులను రక్షించేందుకు సర్వేయర్ల డ్రామా లు కళ్లు బైర్లు కమ్మేలా ఉన్నాయి. ఆధారాలు చెరిపేయలేమని తెలిసీ ఇష్టానుసారంగా సర్వే నివేదికలు ఇచ్చి కోట్లు వెనకేసుకుంటున్నారు. అధికారులు ఇచ్చే నివేదికల ఆధారంగా కబ్జా రాయుళ్లు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఆక్రమణదారులకు ప్రత్యక్షంగా సహకరిస్తూ వందలాది ఎక రాల ప్రభుత్వ భూములకు ఎసరు పెడుతున్నారు. తాజా ఘటన సర్వేయ ర్ల అవినీతి బాగోతానికి సాక్షిగాభూతంగా నిలుస్తుంది.
ఫిర్యాదుల వెల్లువ..
హఫీజ్ పేట్ దీప్తిశ్రీనగర్‌లో ఉన్న రేగుల కుంట కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయినా ఆక్రమణదారులకు సహకరించేలా ఏడీ సర్వే రిపోర్టు ఇవ్వడంపై జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో ఏడీ రాంరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఒకవైపు చెరువులను రక్షించేందుకు హైడ్రా ఏర్పాటు చేశారు. మరో వైపు చెరువు కబ్జా చేస్తున్న వ్యక్తులను స్వయంగా అధికారులు రక్షించే పన్నాగంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. నెలనెలా ప్రజల సొమ్ముతో వేతనాలు తీసుకుంటున్న అధికారులు.. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం తగిన ఆధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. చెరువుల అభివృద్ధి కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతు న్నా ఇంకోవైపు ఆక్రమణల పర్వం కొనసాగుతూనే ఉంది.
నెరవేరని లక్ష్యం..
అనుకున్న లక్ష్యాన్ని అవినీతి అధికారులు దెబ్బ తీస్తున్నారని కసిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. 2020లో అప్పటి రాజేంద్ర నగర్ ఆర్డీవో చంద్రకళకు ఫిర్యాదు చేయగా.. రేగుల కుంట సర్వే నెంబర్ 151 ప్రభుత్వ సర్కారీ చెరువుగా రిపోర్టు ఇచ్చారు. 2026 లో ఇప్పుడున్న శేరిలింగంపల్లి తహశీల్దార్ మహిపాల్ రెడ్డి సర్వే చేయడానికి ఆదేశించగా మండల సర్వేయర్ రిపోర్టు 151 సర్కారీ చెరువులో నిర్మాణాలు చేపడుతున్నట్లు తేలింది. హఠాత్తుగా రేగుల కుంటలో చేపడుతున్న నిర్మాణాలు సర్వే నెంబర్ 151లో లేదని, ఆ నిర్మాణం సర్వే నెంబర్ 150 లో వస్తున్నట్లు ఏడీ సర్వే నివేదిక ఇవ్వడం ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. చెరువు భూమిని కబ్జా చేయడానికి సహకరించిన సర్వేయర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జనం కోసం అధ్యక్షుడు కసి రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తగిన ఆధారాలను ఏడి కార్యాలయం లో సమర్పించారు. వెంటనే సంబంధిత అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సానుకూల స్పందన..
జనం కోసం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చేసిన ఫిర్యాదుపై ఏడీ రాం రెడ్డి సానుకూలంగా స్పందించారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. రేగులకుంట చెరువులో నిర్మాణాలను నిలిపివేసి కఠిన చర్యలు తీసుకోవాలని, దుస్సాహసాలకు పాల్పడే వారికి తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు.






