ఎన్టీఏలో రూ. 520 కోట్ల మిగులున్నా.. అత్తెసరు భద్రతేనా?

by Malleboina Mahesh |

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖజానా నిధుల ప్రవాహంతో కళకళలాడుతోంది. పరీక్షల నిర్వహణలో పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించడంలో విఫలం.

ఎన్టీఏలో రూ. 520 కోట్ల మిగులున్నా.. అత్తెసరు భద్రతేనా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: నీట్ ప్రవేశ పరీక్ష లీకులపై దేశవ్యాప్తంగా యువత రోడ్డుపైకి వచ్చింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆందోళన చేస్తుంది. ఈ నేపథ్యంలో చాలా కీలకమైన విషయాలను కేంద్రమే పార్లమెంట్ వేదికగా బయటపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే కోట్లాది మంది విద్యార్థుల నుంచి ప్రాసెస్ ఫీజుల రూపంలో వందల కోట్లు గుంజుతున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఖజానా నిధుల ప్రవాహంతో కళకళలాడుతోంది. కానీ, దానికి తగినట్లుగా పరీక్షల నిర్వహణలో పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించడంలో, సొంత నెట్‌వర్క్‌ ఏర్పర్చుకోవడంలో ఆ సంస్థ విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి.

గడిచిన ఐదేళ్లలో ఎన్టీఏ ఏకంగా రూ. 3,545 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా, అన్ని ఖర్చులు పోను ఏకంగా రూ. 520 కోట్ల నికర లాభాన్ని (మిగులు నిధులు) మూటగట్టుకుంది. రాజ్యసభలో ఎంపీ డాక్టర్ వి. శివదాసన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానం ద్వారా ఎన్టీఏ అంతర్గత వైఫల్యాలు, నిధుల వినియోగంలో నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ఫెలోషిప్‌ల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించే ఎన్టీఏలో మొత్తం 39 శాశ్వత పోస్టులు మాత్రమే ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి వెల్లడించారు. అయితే ఇవి కూడా డిప్యూటేషన్ పద్ధతిలో భర్తీ చేసినట్లు తెలిపారు.

సొంత వ్యవస్థ ఏదీ?

కోట్లాది రూపాయలు మిగులు నిధులు మూలుగుతున్న, కనీసం భద్రత తో కూడిన సొంత ఐటీ మౌలిక వసతులను కానీ, పటిష్టమైన సెక్యూరిటీ వ్యవస్థను కానీ ఎన్టీఏ ఏర్పాటు చేసుకోకపోవడం గమనార్హం. ఐదేళ్లలో 270 కి పైగా పరీక్షలు నిర్వహించి, 6.6 కోట్లకు పైగా అభ్యర్థుల డేటాను నిర్వహించిన ఈ ఏజెన్సీలో ఉన్నవి కేవలం 39 శాశ్వత పోస్టులే. అవి కూడా ఇతర శాఖల నుంచి వచ్చిన డిప్యూటేషన్ అధికారులే. ప్రశ్నాపత్రాల తయారీ, ఆన్‌లైన్ దరఖాస్తులు, ఎగ్జామ్ సెంటర్ల కేటాయింపు, ఓఎంఆర్ స్కానింగ్ వరకు అత్యంత కీలకమైన పనులన్నింటినీ ప్రైవేట్ థర్డ్-పార్టీ ఐటీ సంస్థలకే టెండర్ల ద్వారా అప్పగించేసి ఎన్టీఏ చేతులు దులుపు కుంటుంది. లాభాలు రూ. 500 కోట్లు దాటినా, కనీసం లీకేజీలు అరికట్టేలా అత్యాధునిక ఎన్‌క్రిప్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రోక్టరింగ్ లేదా సురక్షితమైన సొంత సాఫ్ట్‌ వేర్‌పై ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకపోవడం గమనార్హం.

తాత్కాలిక నియామకాలే..

ఎన్టీఏలో 73 మంది కాంట్రాక్ట్ సిబ్బంది, 124 మంది అవుట్‌సోర్సింగ్ వర్కర్లు పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరీక్షల పర్యవేక్షణకు సైతం సొంత యంత్రాంగం లేకపోవడంతో స్కూల్ టీచర్లు, కళాశాల ప్రొఫెసర్లను తాత్కాలికంగా అబ్జర్వర్లుగా వాడుకుంటున్నారు. సొంత భద్రతా వ్యవస్థ లేకపోవడం, ప్రైవేట్ వెండర్ల ఆధిక్యం, జవాబుదారీతనం లేని తాత్కాలిక నియామకాల వల్లే ఇటీవల నీట్, యూజీసీ-నెట్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో పేపర్ లీకేజీలు, మాల్ ప్రాక్టీస్ ఆరోపణలు గుప్పుమన్నాయనేది స్పష్టమవుతోంది. వేల కోట్లు గడిస్తున్న సంస్థ విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెట్టి ప్రైవేట్ ఏజెన్సీలపై ఆధారపడటం ఎంతవరకు సమంజసమని విద్యావేత్తలు మండిపడుతున్నారు.

బలోపేతం పేరుతో కేవలం 16 పోస్టులు

వందలాది శాశ్వత నియామకాలు చేపట్టి, పటిష్టమైన సైబర్ అండ్ ఫిజికల్ సెక్యూరిటీ నెట్‌వర్క్ నిర్మించాల్సిన ఎన్టీఏలో, పునర్నిర్మాణం పేరుతో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద కేవలం 16 కొత్త పోస్టులను (8 డైరెక్టర్, 8 జాయింట్ డైరెక్టర్) మాత్రమే మంజూరు చేసి చేతులు దులుపుకోవడం గమనార్హం.

Next Story