- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫైళ్లు కదలాలంటే ‘ఆయన’ అనుమతి..! మంథని ఐసీడీఎస్‌లో సంచలన ఆరోపణలు
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ వారి ఆరోగ్యానికి భరోసా కల్పించాల్సిన మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయాలు కొందరి స్వార్థ ప్రయోజనాలకు నిలయాలుగా మారుతున్నాయి.

దిశ, మంథని : గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ వారి ఆరోగ్యానికి భరోసా కల్పించాల్సిన మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయాలు కొందరి స్వార్థ ప్రయోజనాలకు నిలయాలుగా మారుతున్నాయి. ప్రభుత్వ లక్ష్యాలను నీరుగారుస్తూ అంగన్వాడీ వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్న కొందరు సిబ్బంది తీరు ఐసీడీఎస్ శాఖకే మాయని మచ్చగా మారుతోంది. తాజాగా పెద్దపల్లి జిల్లా మంథని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒకరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కాగా, మరొకరు రెగ్యులర్ జూనియర్ అసిస్టెంట్. ఈ ఇద్దరి ఆగడాలు ప్రాజెక్టులో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వీరి అక్రమాలపై గతంలో ఫిర్యాదులు వెళ్లగా, తాజాగా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు పూర్తిస్థాయి విచారణకు ఆదేశించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగిదే పెత్తనం..
ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కేవలం కేటాయించిన పనులు మాత్రమే చేయాల్సి ఉంటుంది. కానీ మంథని సీడీపీఓ కార్యాలయంలోని ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మాత్రం ఏకంగా తానే ఒక సీడీపీఓ స్థాయిలో పెత్తనం చెలాయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆఫీస్ లో ఏ ఫైల్ కదలాలన్నా, అంగన్వాడీ కేంద్రాల బిల్లులు మంజూరు కావాలన్నా సదరు ఉద్యోగి కనుసన్నల్లోనే జరగాలనే అప్రకటిత నిబంధన అమలు చేస్తున్నట్లు సమాచారం. పనిమీద వచ్చే అంగన్వాడీ టీచర్లు, ఆయాల పట్ల దురుసుగా ప్రవర్తించడం, అధికారులను సైతం లెక్కచేయకుండా అజమాయిషీ చేయడం పరిపాటిగా మారింది. ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయనే ధీమాతోనే ఆయన ఈ రీతిలో ప్రవర్తిస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు.
విధులకు డుమ్మా..
ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పరిస్థితి ఇలా ఉంటే.. ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్ తీరు మరోలా ఉంది. కార్యాలయానికి సక్రమంగా హాజరుకాకుండా తరచూ విధులకు డుమ్మా కొడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కీలకమైన బిల్లులు, ఉద్యోగుల సర్వీసు రిజిస్టర్లు, దైనందిన అడ్మినిస్ట్రేషన్ పనులను పర్యవేక్షించాల్సిన ఆయన బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతో ఫైళ్లు ఎక్కడికక్కడే పేరుకుపోయాయి. అంగన్వాడీ కేంద్రాల అత్యవసర నివేదికలు పంపడంలో, సిబ్బంది సమస్యలు పరిష్కరించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని తోటి ఉద్యోగులు వాపోతున్నారు.
కదం తొక్కిన సూపర్‌వైజర్లు..
ఈ ఇద్దరు ఉద్యోగుల వేధింపులు, నిర్లక్ష్యం శృతిమించడంతో కార్యాలయంలోని సూపర్‌వైజర్లు, అంగన్వాడీ సిబ్బంది ఏకమై గతంలో పెద్దపల్లి జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఆధారాలతో సహా రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల్లోని తీవ్రతను పరిశీలించిన మహిళా శిశు సంక్షేమ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ తాజాగా సీరియస్ అయ్యారు. కార్యాలయంలో ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పెత్తనం ఏమిటని, జూనియర్ అసిస్టెంట్ విధులకు ఎలా గైర్హాజరవుతారని ప్రశ్నిస్తూ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. క్షేత్రస్థాయికి వెళ్లి సూపర్‌వైజర్ల వాంగ్మూలాలను నమోదు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్..
ఐసీడీఎస్ వంటి శాఖలో అక్రమాలకు పాల్పడిన సదరు ఉద్యోగులను కేవలం బదిలీలు లేదా మెమోలతో సరిపెట్టకుండా, విధుల నుంచి తొలగించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అంగన్వాడీ, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విచారణ పారదర్శకంగా జరగాలని, లేనిపక్షంలో పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తున్నాయి. కాగా ఈ వ్యవహారంపై పెద్దపల్లి జిల్లా డీడబ్ల్యూఓ స్పందించేందుకు అందుబాటులోకి రాకపోగా, మంథని సీడీపీఓను వివరణ కోరగా తమకు విచారణ గురించి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు.






