- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊర్కొండ ఊరి కొండను కాపాడండి సారూ : ప్రజల ఆక్రందన
ఊర్కొండ అనే పేరు సార్ధకం కావాలంటే.. ఊరిలో ఉన్న గుట్టలు, కొండల తవ్వకాలను అడ్డుకోవాలని ఆ ఊరి ప్రజలకు ఎమ్మెల్యేకు మొరపెట్టుకుంటున్నారు.

దిశ, జడ్చర్ల: బ్లాస్టింగ్ లతో గుట్టలు దద్దరిల్లుతున్నాయి. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ ఆపద ముంచుకొస్తుందోనని నిత్యం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ప్రజలు జీవిస్తున్నారు. ఇదంతా ఎక్కడో కాదు ఊర్కొండ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, రైతువేదిక, నూతనంగా నిర్మాణం చేపట్టి కేజీబీవీ పక్కనే ఉన్న గుట్టపై జరుగుతుంది. గుత్తేదారులకు అధికార పార్టీ నియోజకవర్గ బాస్ అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఊరి పేరులోనే ఉన్న కొండలు రానున్న రోజుల్లో కనుమరుగయ్యే పరిస్థితి లేకపోలేదు. భవిష్యత్తులో ఇక్కడ ఇలాంటి కొండలు ఉండేవి అని చెప్పుకునే పరిస్థితి రాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
కేజీబీవీ విద్యాలయానికి గండం
వచ్చే విద్యా సంవత్సరం (2026-27) ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కస్తూర్బా బాలికల విద్యాలయం(కేజీబీవీ) ఈ అక్రమ తవ్వకాలకు అతి సమీపంలోనే ఉంది. నిత్యం జరుగుతున్న భారీ పేలుళ్ల ధాటికి పాఠశాల భవనం ప్రారంభానికి ముందే పగుళ్లు బారే ప్రమాదం ఉంది. కేవలం బడి మాత్రమే కాదు.. పక్కనే ఉన్న తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, రైతువేదిక వంటి ప్రభుత్వ భవనాలు కూడా ఈ ప్రకంపనల ధాటికి ఎప్పుడు ఏమవుతాయోనని ఉద్యోగులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
వడ్డెరల పొట్టకొట్టి..
తరతరాలుగా ఆ కొండలనే నమ్ముకుని బతుకుతున్న స్థానిక వడ్డెరలను గుత్తేదారులు దగా చేస్తున్నారు. వారిని పక్కన పెట్టి, బీహార్, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి కూలీలను రప్పించి రాత్రింబవళ్లు పని చేయిస్తున్నారు. సంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి భారీ యంత్రాలు, శక్తిమంతమైన పేలుడు పదార్థాలను వాడుతూ రాతి కడిలను ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు. స్థానికులకు దక్కాల్సిన ఉపాధిని ఇతర రాష్ట్రాల వారికి కట్టబెట్టి, మధ్య దళారులు కోట్లు గడిస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణ లోపం..
జనవాసాలు, ప్రభుత్వ కార్యాలయాల మధ్య ఇంత బహిరంగంగా బ్లాస్టింగ్లు జరుగుతున్నా మైనింగ్ శాఖ అధికారులు అటువైపు చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అనుమతులు ఉన్నాయా? ఉంటే పరిమితికి మించి తవ్వకాలు ఎలా చేస్తున్నారు?
పేలుళ్ల సమయంలో పాటించాల్సిన కనీస భద్రతా ప్రమాణాలు ఎక్కడ?
అధికారుల మౌనం వెనుక ఉన్న మర్మమేమిటి? అంతుపట్టడం లేదు.
కాపాడండి ఎమ్మెల్యే గారూ
గతంలో ఊర్కొండపేట ఆలయ పరిసరాల్లో గుట్టల తవ్వకాలను స్థానిక ఎమ్మెల్యే అడ్డుకుని ప్రకృతిని కాపాడారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు మండల కేంద్రంలోని గుట్టను కూడా కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. 'ఊరుకొండ' అన్న పేరు సార్థకం కావాలంటే, ప్రకృతిని కాపాడటంతో పాటు ప్రభుత్వ ఆస్తులను వినాశనం కాకుండా చూడాల్సిన బాధ్యత నాయకులు, అధికారులపై ఉంది. ఇప్పటికైనా యంత్రాంగం నిద్ర మేల్కోకపోతే, ఊర్కొండలో కొండలు కేవలం చరిత్ర పుస్తకాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.






