మంత్రి ఇలాఖలో అనధికారిక డాక్టర్

by Bhanu |

జిల్లాలోని మక్తల్ నియోజక వర్గ పరిధిలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనధికారిక డాక్టర్ పనితీరు ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది.

మంత్రి ఇలాఖలో అనధికారిక డాక్టర్
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : జిల్లాలోని మక్తల్ నియోజక వర్గ పరిధిలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనధికారిక డాక్టర్ పనితీరు ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పనిచేయాలి. పిహెచ్ సీలో అర్హతలు లేని వ్యక్తి ‘డాక్టర్’ లా వ్యవహరిస్తూ రోగులకు పరీక్షలు చేయడం వంటి పనులు బయటపడటంతో శంకర్ దాదా సినిమాను త‌లపిస్తున్న‌ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై బహిరంగ చర్చ జరుగుతుంది. జిల్లాలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ డాక్టర్ తన విధుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోజువారీగా రోగులు ఆసుపత్రికి వచ్చినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు ప్రసవ నొప్పులతో వ‌చ్చినా.. చిన్న పిల్లల కేసులు అత్యవసరంగా వచ్చినా పట్టించుకోని సందర్భాలు ఉన్నాయి.

హెల్పర్ కు డాక్టర్ పోస్టు బాధ్యతలు..?

హెల్పర్ పని హెల్పర్ చేయాలి... డాక్టర్ పని డాక్టర్ చేయాలి....కానీ హెల్పర్ డాక్టర్ బాధ్యతల్లో అనధికారికంగా కొనసాగుతూ వచ్చి రాని వైద్య సేవలు అందిస్తూ నిబంధనలను అతిక్రమిస్తున్నాడు. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా రోజువారీ వైద్యసేవలు మొత్తం ఒక సహాయకుడి చేతుల్లోనే నడుస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య అవగాహన కూడా సరిగా లేనప్పటికీ, రోగులను తనే పరిశీలించడం వంటి పనులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా ఆరోగ్యం ముప్పులో పడే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అర్హతలేని వ్యక్తుల చేత చికిత్సలు చేయించడం వల్ల తప్పుడు ఇంజెక్షన్లు, తప్పుడు డోసులు, తప్పుడు మందుల వల్ల సైడ్‌ ఎఫెక్టులు, ప్రాణాపాయ పరిస్థితులు కూడా తలెత్తే ప్రమాదం ఉన్నాయనీ ప్రజలు ఆరోపిస్తున్నారు. పిహెచ్ సీలకు వెళ్ళితే అర్హత లేనివారితో వైద్య చికిత్సలు అందిస్తే హాని జరిగే అవకాశం లేకపోలేదు. పిహెచ్ సీలో జరుగుతున్న అక్రమ వైద్య కార్యకలాపాలపై తక్షణమే ఉన్నతస్థాయి విచార‌ణ చేప‌ట్టి నిజానిజాలను గుర్తించి అధికారిక డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story