కొడంగల్ గడ్డపై అన్నదాతలకు తప్పని అవస్థలు

by Malleboina Mahesh |

కొడంగల్ ధాన్యం కేంద్రాల్లో అన్నదాతల అగచాట్లు. నీడ, నీరు వంటి కనీస వసతులు లేక, గన్ని బ్యాగుల కొరతతో కొనుగోళ్లలో జాప్యంపై రైతన్నల ఆవేదన.

కొడంగల్ గడ్డపై అన్నదాతలకు తప్పని అవస్థలు
X

దిశ, కొడంగల్: నేల తల్లిని నమ్ముకొని ఆరుగాలం శ్రమించి, చెమటోడ్చి పండించిన పంట చేతికొచ్చిన వేళ.. ఆ సంతోషం రైతు దరికి చేరడం లేదు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి చూస్తుంటే, అన్నదాతల కష్టం అగమ్యగోచరంగా మారింది. నియోజకవర్గంలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండలాల పరిధిలో ఉన్న 41 కేంద్రాల్లోనూ దాదాపు ఇదే దుస్థితి నెలకొనడం కలిచివేస్తోంది.

కన్నీరు పెట్టిస్తున్న కనీస వసతులు..

ప్రభుత్వ నిబంధనలు కాగితాల మీద పటిష్టంగా కనిపిస్తున్నా, క్షేత్ర స్థాయిలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో చాలా వరకు అలాగే ఉన్నాయి. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ అన్నదాతలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఎండలు మండుతున్నా కేంద్రాల వద్ద కనీసం తలదాచుకోవడానికి నీడ లేదు. తాగడానికి గుక్కెడు నీరు దొరకని పరిస్థితి నెలకొంది. అకస్మాత్తుగా వర్షం వస్తే ధాన్యం తడవకుండా కాపాడుకోవడానికి తగినన్ని టార్పాలిన్లు లేవు. రైతులు తమ సొంత ఖర్చులతో పట్టాలను తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

నిరీక్షణ తీరని వేళ..!

గన్ని బ్యాగుల (సంచుల) కొరత రైతులకు శాపంగా మారింది. దీనికి తోడు తూకం వేయడంలో జరుగుతున్న జాప్యం వల్ల, పొలాల్లో ఉండాల్సిన రైతన్నలు వారాల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ధాన్యంలోని తేమను కొలిచే యంత్రాలు సక్రమంగా లేకపోవడం, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి చిన్న చిన్న అవసరాలను కూడా పట్టించుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది.

కనీస వసతులు కరువు..

పంట పండించడం ఒక ఎత్తు.. దానిని అమ్ముకోవడం మరో ఎత్తు. కనీసం కూర్చోవడానికి నీడ, తాగడానికి నీళ్లు లేని చోట పగలు రాత్రి కావలి ఉండాల్సి వస్తోంది. ‘మా కష్టానికి ప్రతిఫలం ఎప్పుడు దక్కుతుందో అర్థం కావడం లేదు’ అని ఒక స్థానిక రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో తమకు మేలు జరుగుతుందని ఆశించిన రైతులకు ఈ అవస్థలు తీవ్ర నిరాశను మిగిలిస్తున్నాయి. కొనుగోళ్లలో జాప్యాన్ని ఆసరాగా చేసుకొని దళారులు తక్కువ ధరకే ధాన్యాన్ని చేజిక్కించుకునే ప్రమాదం పొంచి ఉంది.

మోర ఆలకించండి..

కొడంగల్ నియోజకవర్గంలోని రైతుల గోడును ఆలకించి, ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని రైతాంగం కోరుతోంది. 41 కేంద్రాల్లో తూకం ప్రక్రియను వేగవంతం చేసి, ధాన్యం సేకరణను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. రైతుల కోసం తక్షణమే తాగునీరు, నీడ (టెంట్లు), రాత్రి వేళల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలి. సరిపడా గన్ని బ్యాగులను, టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలి. సన్న, దొడ్డు రకం ధాన్యం సేకరణ పై స్పష్టత నిస్తూ, దళారుల ప్రమేయం లేకుండా చూడాలి. రైతే రాజు అన్న నినాదం నిజం కావాలంటే, వారి కష్టం కళ్లముందే పాలవకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై, ప్రజాప్రతినిధులపై ఉంది.

Next Story