అమరవాయిలో విషాదం.. ఈతకు వెళ్లిన బాలుడు మృతి

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-03-08 11:40:15  IST  )

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం అమరవాయి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు బావిలో మునిగి గల్లంతయ్యాడు.

అమరవాయిలో విషాదం.. ఈతకు వెళ్లిన బాలుడు మృతి
X

దిశ, గద్వాల క్రైం/మల్దకల్ : జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం అమరవాయి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఈతకు వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు బావిలో మునిగి గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అమరవాయి గ్రామానికి చెందిన జయరాజు (13) ఆదివారం మధ్యాహ్నం తన స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని ఒక బావిలో ఈత కొట్టడానికి వెళ్లాడు. ఈత కొడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు నీటి లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లడంతో జయరాజు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. తోటి స్నేహితులు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.

రంగంలోకి పోలీసులు, ఫైర్ సిబ్బంది

సమాచారం అందుకున్న వెంటనే మల్దకల్ ఎస్ఐ శ్రీహరి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలో నీరు నిండుగా ఉండటంతో బాలుడి ఆచూకీ కనుగొనడం కష్టంగా మారింది. దీంతో వెంటనే ఫైర్ సిబ్బందిని పిలిపించి, ఫైర్ ఇంజన్ మోటార్ల సహాయంతో బావిలోని నీటిని బ‌య‌టికి పంపించారు. ఆ త‌రువాత నీరు త‌గ్గాక గాలించ‌క బాలుడి మృత‌దేహం ల‌భ్య‌మైంది. చాలా సేపు ఈత‌గాళ్లు వెతికిన త‌రువాత బాలుడి ఆచూకి ల‌భ్య‌మైంది.

మిన్నంటిన రోదనలు

కళ్ల ముందే ఆడుకుంటూ వెళ్లిన కుమారుడు తిరిగి రాని లోకాలకు వెళ్లాడని తెలిసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి రోదనలు చూసి గ్రామస్తులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో, పిల్లలు చెరువులు, బావులు మరియు కుంటల వద్దకు వెళ్లే సమయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story