బలి తీసుకున్న కూలిపని.. పిడుగుపాటుకు ముగ్గురు మృతి

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-10 13:39:36  IST  )

జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిడుగుపడి ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

బలి తీసుకున్న కూలిపని.. పిడుగుపాటుకు ముగ్గురు మృతి
X
  • పిడుగుపాటుకు ముగ్గురు మృతి
  • మరో నలుగురికి గాయాలు
  • జోగులాంబ గద్వాల జిల్లా ఐజలో ఘటన
  • ఆసుపత్రి వద్ద మిన్నంటిన రోదనలు

దిశ, జోగులాంబ గద్వాల /ఐజ : జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిడుగుపడి ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఐజ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి . ఐజ మండలం భూమ్‌పురం గ్రామంలో తిమ్మప్ప అనే రైతు పొలంలో సీడ్ పత్తి క్రాసింగ్ పనులకు ఏడుగురు కూలీలు వెళ్లారు. సాయంత్రం వర్షం కురయడంతో కూలీలు అందరూ పొలంలో ఉన్న వేప చెట్టు కిందకు వెళ్లారు. ఆ సమయంలో ఉరుములు, మెరుపులు రావడంతో చెట్టుపై పిడుగు పడింది. ఈ సంఘటనలో భూమ్‌పురానికి చెందిన సర్వేష్ (19), పార్వతి (28), పులికల్ గ్రామానికి చెందిన సౌభాగ్యమ్మ (45) అక్కడికక్కడే మరణించారు.

ఇదే గ్రామానికి చెందిన భార్య భర్తలు రాజు, జ్యోతితో పాటు కావ్య, తిమ్మప్పకు గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు హుటాహుటిన మృతులు, గాయపడ్డ వారిని ఐజలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సర్వేశ్, పార్వతి, సౌభాగ్యమ్మ మృతి చెందగా రాజు, జ్యోతి, తిమ్మప్ప, కావ్యకు వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న మృతుల కుటుంబీకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి తరలివచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.

Next Story