- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ గణపట్ రావు పాటిల్ పేర్కొన్నారు.

దిశ, కందనూల్ : రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ గణపట్ రావు పాటిల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు సంబంధిత అధికారులతో మాట్లాడుతూ .. గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల రెండవ రోజైన శుక్రవారం తెలకపల్లి మండల పరిధిలోని గౌరెడ్డిపల్లి, తెలకపల్లి క్లస్టర్లలో కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియను జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ గణపట్ రావు పాటిల్ తో కలిసి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలకపల్లి క్లస్టర్లు గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలకపల్లి, రాకొండ, రామ్ రెడ్డి పల్లి, కమ్మా రెడ్డి పల్లి, దాసు పల్లి, గౌరెడ్డిపల్లి క్లస్టర్లు గ్రామపంచాయతీ కార్యాలయంలో గౌరెడ్డిపల్లి, లక్నారం, గోలగుండం, గట్టునెల్లికుదురు గ్రామాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. రిటర్నింగ్ అధికారులను నామినేషన్ ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నామినేషన్ కేంద్రం ముందు ఫోటోతో ఓటర్ల జాబితా, గ్రామాల వార్డుల వారిగా రిజర్వేషన్ల జాబితా అంటించాలన్నారు. నామినేషన్ కేంద్రాలకు వంద మీటర్ల పరిధిలో ఎవరూ గుంపులుగా రాకుండా చూసుకోవాలని రిటర్నింగ్ అధికారితో పాటు సహాయక రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో తెలకపల్లి మండల పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలకపల్లి మండలంలోని 7 క్లస్టర్లలో 28 గ్రామ పంచాయతీల్లో 28 సర్పంచ్ ఎన్నికలు, 260 వార్డులకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేలా అన్ని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి, పక్కాగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, శనివారంతో మొదటి విడత ఎన్నికలకు ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ అనంతరం నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ గణపట్ రావు పాటిల్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన పారదర్శకమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బందికి సూచించారు. ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరిగేలా పని చేయాలని పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛిత పరిస్థితులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు పారదర్శకమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రతి సిబ్బందిపైన ఉందన్నారు. ఎన్నికల్లో శాంతి భద్రతలను కాపాడటంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. ఎన్నికల ప్రక్రియను భంగ పరచాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని సెన్సిటివ్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ప్రతి పోలింగ్ కేంద్రంలో పకడ్బందీ బందోబస్తు, పెట్రోలింగ్, క్విక్ రెస్పాన్స్ టీంలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
అక్రమ డబ్బు, మద్యం పంపిణీ, బెదిరింపులు, అనైతిక ప్రలోభాలు వంటి తప్పిదాలు ఎక్కడైనా గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు ఎస్పి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ జాకీర్ అలీ, ఎంపీడీవో తరుణ్, ఎంపీఓ వెంకటేష్, ఎంఈఓ శ్రీనివాసరెడ్డి, ఎస్సై నరేష్, కోటేశ్వరరావు, ఆయా గ్రామ పంచాయతీల రిటర్నింగ్ అధికారులు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.






