గునుముక్ల కడపరాయ స్వామికి పొంచి ఉన్న మైనింగ్ ముప్పు

by Malleboina Mahesh |

నారాయణపేట జిల్లా గునుముక్ల కడపరాయ స్వామి గుట్టపై మైనింగ్ తవ్వకాలకు కుట్ర.. ఆలయ ఉనికి కోసం పోరుబాట పట్టిన ఐదు గ్రామాల ప్రజలు!

గునుముక్ల కడపరాయ స్వామికి పొంచి ఉన్న మైనింగ్ ముప్పు
X

దిశ, ధన్వాడ: కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా, దశాబ్దాల చారిత్రక వైభవంతో విరాజిల్లుతున్న నారాయణపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. గునుముక్ల 'కడప రాయ వెంకటేశ్వర స్వామి' ఆలయ ఉనికికే ఇప్పుడు ముప్పు పొంచి ఉంది. భక్తుల ఆరాధ్యదైవంగా, స్వయంభూ క్షేత్రంగా వెలుగొందుతున్న మాలగుట్టపై తెరచాటున మైనింగ్ తవ్వకాలకు అనుమతులు సాధించేందుకు గనుల మాఫియా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో గుట్ట పరిసరాల్లోని ఐదు గ్రామాల ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమ ఆరాధ్య దైవాన్ని, చారిత్రక సంపదను కాపాడుకునేందుకు పోరుబాట పట్టారు.

ప్రమాదపుటంచున ఆలయాలు..

దాదాపు నాలుగు నుంచి ఐదు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతి ఏటా వారం రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు, జాతర ఎంతో ప్రసిద్ధి చెందాయి. ధన్వాడ మండలం తో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చే భక్తులు స్వామివారికి నైవేద్యాలు (దాసంగాలు) సమర్పించడం ఆనాదిగా వస్తున్న ఆనవాయితీ. దాతల సహకారం, భక్తుల ప్రోత్సాహంతో ఇటీవలే గుట్టపైకి సిమెంట్ రోడ్డు, విద్యుద్దీకరణ వంటి ఎన్నో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ఆలయం దేదీప్యమానంగా వెలుగుతున్న తరుణంలో.. సర్వే నెంబర్ 144 పరిధిలో, ఆలయానికి అత్యంత సమీపంలో మైనింగ్ తవ్వకాలు జరపడానికి స్కెచ్ వేయడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్ పేలుళ్ల ధాటికి గుట్టపై కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శివుడు, నందీశ్వరుల ఆలయాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు.

నిబంధనలు తూచ్...

పురాతన ఆలయాలు, పూజా స్థలాల సమీపంలో మైనింగ్ తవ్వకాలు చేపట్టడం చట్టవిరుద్ధమని తెలిసినా స్వార్థ ప్రయోజనాల కోసం నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.గనులు, భూగర్భ శాఖ నిబంధనలతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చారిత్రక ఆలయాలకు కిలోమీటర్ పరిధిలో మైనింగ్ పూర్తిగా నిషేధించబడింది. కానీ, ప్రస్తుత మైనింగ్ ప్రతిపాదనలు ఒకే గుట్ట పరిధిలోకి రావడం గమనార్హం.1958 ప్రాచీన స్మారక చిహ్నాల చట్టం ప్రకారం ప్రాచీన ఆలయాలకు ప్రత్యేక రక్షణ ఉంటుంది. అలాగే, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, పూజా స్థలాలకు భంగం కలగకుండా చూసేందుకు ఉద్దేశించిన 'ఆరాధనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం-1991'ని కూడా ఇక్కడ బేఖాతరు చేస్తున్నట్లు భక్తులు విమర్శిస్తున్నారు.

పోరుబాటకు సిద్ధం...

దేవుడిని కూడా లెక్కచేయకుండా, లాభాలే పరమావధిగా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న మైనింగ్ ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని స్థానికులు హెచ్చరిస్తున్నారు. మత విశ్వాసాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అధికారులు స్పందించి మైనింగ్ అనుమతులను రద్దు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఐదు గ్రామాల ప్రజలు, భక్తులు స్పష్టం చేస్తున్నారు.

దేవుడే కొలువయ్యాడు..

గున్ముక్ల గుట్టపై కొలువైన వెంకటేశ్వర స్వామిని మా తాతల నుంచి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నాం. ప్రతిఏటా మాఘమాసంలో జాతర జరుగుతుందని, పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ప్రాంతంలో మైనింగ్ తవ్వకాలు జరిపితే ఆలయానికే ప్రమాదం పొంచి ఉంటుంది. మైనింగ్ తవ్వకాలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు ఇవ్వరాదు.:- నంబి నాగరాజు, ఆలయ పూజారి

భక్తుల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకోం

ఎన్నో దశాబ్దాల చరిత్ర గల కడప రాయ స్వామి గుట్టపై మైనింగ్ తవ్వకాలు చేపడితే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. మైనింగ్ తవ్వకాలకు అనుమతినిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలి. :- శ్రీనివాస్ రెడ్డి ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు

Next Story