- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైసు మిల్లర్ల మాయాజాలం..!
దిశ, గద్వాల క్రైమ్ : జోగులాంబ గద్వాల జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కింద ప్రభుత్వానికి అప్పగించాల్సిన ధాన్యం విషయంలో జరుగుతున్న భారీ అక్రమాలు

దిశ, గద్వాల క్రైమ్ : జోగులాంబ గద్వాల జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కింద ప్రభుత్వానికి అప్పగించాల్సిన ధాన్యం విషయంలో జరుగుతున్న భారీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా జిల్లా కేంద్రంలోని ఒక రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ. 2.25 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం నిల్వలు మాయమైనట్లు గుర్తించడంతో జిల్లాలో పెను సంచలనం రేగింది. విజిలెన్స్ అధికారులు అకస్మికంగా జరిపిన తనిఖీలలో ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని ప్రయివేటు రైసు మిల్లర్లకు బియ్యం మర ఆడించడం కోసం కేటాయించిన ధాన్యంలో 26, 240 బస్తాల (సుమారు రూ. 2.25 కోట్లు) మేర కొరత ఉన్నట్లు తేలింది. ఈ ధాన్యాన్ని మిల్లు నిర్వాహకులు అక్రమంగా విక్రయించుకున్నారా..? లేక పక్కదారి పట్టించారా..? అనే కోణంలో అధికారులు విచారణ చేపడుతున్నారు.
మిగిలిన మిల్లుల మాట దేవుడెరుగు
ఒక్క రైస్ మిల్లులోనే ఇంత పెద్ద మొత్తంలో (రూ. 2.25 కోట్లు) ధాన్యం అక్రమం వెలుగులోకి రావడంతో, మిగిలిన రైస్ మిల్లుల్లో పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న ఉదయిస్తోంది. జిల్లాలో ఇంకా సీఎంఆర్ బియ్యాన్ని అప్పగించాల్సిన రైస్ మిల్లులు అనేకం ఉన్నాయి. వాటిలో నిల్వలను పరిశీలిస్తే అక్రమాల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
మిల్లర్ల గుండెల్లో రైళ్లు
ఒక మిల్లుపై జరిగిన ఈ దాడిలో భారీ మొత్తంలో నిల్వలు మాయమైనట్లు తేలడంతో, అక్రమాలకు పాల్పడిన మిగతా రైస్ మిల్లర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమ మిల్లులపైనా విజిలెన్స్ దాడులు జరుగుతాయేమోనని మిల్లర్లు భయందోళనకు గురవుతున్నారు. అక్రమ దందాలను దాచిపెట్టేందుకు రాత్రికి రాత్రే పక్కదారి పట్టిన ధాన్యాన్ని సేకరించి నిల్వలను చూపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
అమ్ముకున్న వడ్లకు ప్రత్యామ్నాయం
అమ్ముకున్న వడ్లకు బదులుగా, ఆయా మిల్లులు తమ ఖాతాలను సరిచేయడానికి (క్లియర్ చేయడానికి) హైదరాబాద్ వంటి ప్రాంతాల నుండి ప్రతిరోజూ తక్కువ ధరకు కొనుగోలు చేసిన సన్న బియ్యాన్ని డిసిఎం వాహనాలలో గద్వాలకు రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది.ఎఫ్సీఐ/రేషన్ పంపిణీకి ఈ బియ్యాన్ని, అధికారులు తనిఖీకి రాకముందే లేదా తనిఖీ సమయంలో, తమ మిల్లుల్లో నిల్వ ఉన్నట్లుగా చూపించి, అక్కడి నుండి ఎఫ్సీఐ (FCI) గోడౌన్లకు, ఆపై రేషన్ షాపులకు పంపిణీకి తరలిస్తున్నారని సమాచారం. ఈ మొత్తం వ్యవహారంపై అధికారులు సమగ్ర విచారణ జరిపి, ప్రభుత్వ ధాన్యాన్ని కొల్లగొట్టిన రైస్ మిల్లర్లపై పీడీ యాక్ట్‌తో సహా కఠిన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు మరియు జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మాయమైన ధాన్యాన్ని రికవరీ చేసి, ఈ అక్రమాలకు సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






