- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెరుగుతున్న గట్ల పంచాయతీలు.. 'చేయి' తడిపితేనే సర్వే
గద్వాల జిల్లాలో భూముల సర్వే ప్రక్రియ రైతాంగానికి నరకప్రాయంగా మారింది. భూ సరిహద్దులు, గట్ల వివాదాలు, వారసత్వ మార్పులు, భూ వినియోగ మార్పిడి (కన్వర్షన్) వంటి పనుల కోసం సర్వే తప్పనిసరి కాగా.. సంబంధిత అధికారులు, సర్వేయర్లు మాత్రం నిర్లక్ష్యపు నిద్ర వీడటం లేదు.

దిశ, జోగులాంబ ప్రతినిధి: గద్వాల జిల్లాలో భూముల సర్వే ప్రక్రియ రైతాంగానికి నరకప్రాయంగా మారింది. భూ సరిహద్దులు, గట్ల వివాదాలు, వారసత్వ మార్పులు, భూ వినియోగ మార్పిడి (కన్వర్షన్) వంటి పనుల కోసం సర్వే తప్పనిసరి కాగా.. సంబంధిత అధికారులు, సర్వేయర్లు మాత్రం నిర్లక్ష్యపు నిద్ర వీడటం లేదు. సకాలంలో సర్వేలు జరగక, కార్యాలయాల చుట్టూ తిరగలేక అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు అధికారులు చేయి తడిపితేనే గానీ పొలాల్లోకి అడుగు పెట్టడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
లంచమిస్తేనే...
భూముల కొలతలు, సరిహద్దు రాళ్ల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్న రైతులను సర్వేయర్లు నెలల తరబడి తిప్పించుకుంటున్నారు. కాసులు కురిపించిన వారి పనులను చకచకా పూర్తి చేస్తూ, పేద, సాధారణ రైతుల దరఖాస్తులను మాత్రం బుట్టదాఖలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎకరానికి 2 నుంచి 5 వేల రూపాయల వరకు, మండల కేంద్రాలు, రియల్ ఎస్టేట్ డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఎకరానికి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వ సర్వేయర్లు సతాయిస్తుండటంతో తట్టుకోలేక కొందరు రైతులు అదనపు భారం భరిస్తూ ప్రైవేట్ సర్వేయర్లను ఆశ్రయించాల్సి వస్తోంది.
పెరిగిపోతున్న గట్ల పంచాయతీలు...
సర్వేలు సకాలంలో పూర్తి కాకపోవడంతో గ్రామాల్లో పొరుగు రైతుల మధ్య సరిహద్దు వివాదాలు ముదురుతున్నాయి. చిన్నపాటి గట్ల తగాదాలు కాస్తా పెద్ద ఘర్షణలకు దారితీస్తున్నాయి. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నా.. రెవెన్యూ, సర్వే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం.
ఏసీబీకి చిక్కిన మారని తీరు...
జిల్లాలో అవినీతి ఏ స్థాయిలో వేళ్లూనుకుందో చెప్పడానికి ఇటీవల వడ్డేపల్లి మండలంలో జరిగిన ఘటనే నిదర్శనం. భూ సర్వే నిర్వహించేందుకు ఓ రైతు నుంచి రూ. 10 వేలు లంచం డిమాండ్ చేసి, తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సదరు మండల సర్వేయర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పటికీ, క్షేత్రస్థాయిలో సర్వేయర్ల తీరులో మార్పు రాలేదని రైతులు చెబుతున్నారు.
డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయండి
జిల్లాలో పొలాల సర్వే కోసం ఎవరైనా అధికారులు లేదా సర్వేయర్లు డబ్బులు డిమాండ్ చేస్తే రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వరాని ఆర్డీవో తెలిపారు. బాధితులు వెంటనే ఉన్నతాధికారులకు లేదా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కు ఫిర్యాదు చేయాలన్నారు. లంచం అడిగే వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో తెలిపారు.






