అద్దెల.. ‘మోత’!

by velandi.Saikiran |

ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో వరికోత యంత్రాల అద్దెల మోత రైతుల పాలిట శాపంగా మారింది.

అద్దెల.. ‘మోత’!
X

అద్దెల.. ‘మోత’!

వరికోత యంత్రాలకు అద్దెలు వసూళ్లు

పొలం రైతులది.. అద్దెల నియంత్రణ యజమానులది!

బయటి హార్వెస్టర్లు రాకుండా అడ్డుకుంటున్న స్థానిక సిండికేట్

బురద సాకుతో వెనక్కి ముందుకు తోలుతూ సమయం వృథా

ప్రకృతి ప్రకోపం, అడ్డగోలు రేట్లతో రైతన్నకు భారీగా నష్టం

కాగితాలకే పరిమితమైన ప్రభుత్వ సీహెచ్‌సీ కేంద్రాలు..

పట్టించుకోని అధికార యంత్రాంగం

ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో వరికోత యంత్రాల అద్దెల మోత రైతుల పాలిట శాపంగా మారింది. పగలు రాత్రి కష్టపడి పండించిన పంటను కాపాడుకునేందుకు రైతులు వేలాది రూపాయలు అద్దెగా చెల్లించాల్సి వస్తోంది. మార్కెట్లో చైన్ వీల్ యంత్రాలకు ఎకరాకు రూ.4వేల వరకు వసూలు చేస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా మండలాల్లో స్థానికంగా పోటీ లేకుండా చేసేందుకు బయటి ప్రాంతాల హార్వెస్టర్లను రాకుండా కొందరు యంత్రాల యజమానులు అడ్డుకుంటున్నారు. అటు ప్రకృతి ముప్పు, ఇటు యంత్రాల యజమానుల షరతులతో తాము నిలువునా మునుగుతున్నామని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని హార్వెస్టర్ల రేట్లను క్రమబద్ధీకరించి, దోపిడీదారులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

దిశ, రేవల్లి : రేవల్లి, ఏదుల మండలాల్లోని ఆయా గ్రామాల్లో రైతులు పండించిన పంటపై అద్దె యంత్రాల దోపిడీ దండయాత్ర జోరుగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో పెట్టుబడి కంటే కోత ఖర్చే అధికమవుతుండడంతో రైతాంగం లబోదిబోమంటోంది. వరి కోత సమయంలో పంట చేతికి వచ్చే ఆనందం కంటే ప్రకృతి ప్రకోపం, యంత్రాల అద్దెలు రూ.వేలల్లో వెచ్చించాల్సి రావడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. పగలు రాత్రి కాయకష్టం చేసి పండించిన పంట ఈదురుగాలులు, వడగండ్ల వానలకు ఎక్కడ నేలపాలవుతుందోననే భయంతో రైతులు వరికోత యంత్రాల యజమానులను వేడుకుంటూ వారు అడిగినంత ఇచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంటుంది. ఒకవైపు ప్రకృతి దెబ్బలు, మరోవైపు యంత్రాల అద్దె దోపిడీతో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు.

మూడు రకాల యంత్రాలు.. మూడు రేట్లు..

ప్రస్తుతం మార్కెట్లో సింగల్ వీల్, ఫోర్ వీల్, చైన్ వీల్ అని మూడు రకాల వరికోత యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. నేల స్వభావాన్ని బట్టి రైతులు వీటిని వాడుతుంటారు. అయితే, ప్రస్తుతం పలు గ్రామాల్లో ఎకరాకు సింగల్ వీల్‌కు రూ.2500, ఫోర్ వీల్‌కు రూ.3500, చైన్ వీల్‌కు ఏకంగా రూ.4వేల వరకు అద్దెలు వసూలు చేస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బయటి యంత్రాలు రాకుండా అడ్డు..

ఆయా గ్రామాల్లోకి బయటి ప్రాంతాల నుంచి వచ్చే హార్వెస్టర్లను స్థానిక యంత్రాల యజమానులు అడ్డుకుంటున్నారు. దీంతో మార్కెట్లో పోటీ తగ్గిపోయి, రైతులపై అదనపు అద్దె భారం పడుతోంది. పోటీ ఉంటే రేట్లు తగ్గే అవకాశం ఉండేదని, కానీ బయటి యంత్రాలను రాకుండా చేయడంతో రైతు పూర్తిగా కొందరి కరుణపైనే ఆధారపడాల్సి వస్తోందని వాపోతున్నారు.

సమయం మాది.. అవసరం రైతుది!

కోత కోసం వచ్చిన యంత్రాలను బురదలో దిగబడుతుందనే సాకుతో గంటల తరబడి వెనక్కి ముందుకూ తోలుతూ కావాలనే సమయాన్ని లాగుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఆలస్యం పెరిగే కొద్దీ మరింత అద్దె వసూలు చేయవచ్చనేది నిర్వాహకుల ప్లాన్. ‘సమయం మాది.. అవసరం రైతుది’ అన్నట్లుగా కొందరు యంత్రాల నిర్వాహకులు వ్యవహరిస్తున్నారని, దీనిని ప్రశ్నిస్తే కోతను మధ్యలోనే వదిలేసి వెళ్తామని బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాగితాలకే పరిమితమైన సీహెచ్‌సీ కేంద్రాలు...

వ్యవసాయ యంత్రాలు కొనలేని చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం తరఫున తక్కువ అద్దెకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు అందించేందుకు కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఇవి మార్కెట్‌లో ప్రైవేట్ ధరలను నియంత్రించడానికి ఉపయోగపడతాయి. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలు కేవలం కాగితాలకు, ప్రకటనలకే పరిమితమయ్యాయి. రైతులకు వీటి గురించి ఎక్కడా అవగాహన కల్పించకపోవడం వల్ల, వారు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ యంత్రాలపై ఆధారపడి నష్టపోతున్నారు.

నిద్రావస్థలో అధికార యంత్రాంగం...

వరి కోత యంత్రాల అద్దెల పేరుతో ఇంత బహిరంగ దోపిడీ జరుగుతున్నా పాలకులు, అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. అధికారుల నియంత్రణ లేకపోవడంతో యజమానులు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుతున్నారు. వర్షాలు పడితే పంట పాడవుతుందనే రైతుల బలహీనతను వారు ఆసరాగా చేసుకుంటున్నారు. ‘పొలం, పంట, కష్టం రైతులది.. అద్దెల నిర్ణయం యంత్రాల యజమానులది’ అన్న చందంగా వ్యవస్థ తయారైంది. ఇప్పటికైనా స్థానిక పాలకులు, అధికారులు జోక్యం చేసుకుని హార్వెస్టర్ల అద్దెపై పరిమితి విధించాలని, గ్రామాల్లో ప్రభుత్వ యంత్రాలను అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story