- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గద్వాల - ఆత్మకూరు మధ్య సాకారం కానున్న 'వారధి'
గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం, వనపర్తి జిల్లా ఆత్మకూరు మధ్య కృష్ణా నది పై నిర్మిస్తున్న నూతన వారధి (బ్రిడ్జి) పనులకు రాజకీయ దురుద్దేశంతో కొందరు అడ్డుపడుతున్నారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆరోపించారు.

దిశ, గద్వాల జోగుళాంబ : గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం, వనపర్తి జిల్లా ఆత్మకూరు మధ్య కృష్ణా నది పై నిర్మిస్తున్న నూతన వారధి (బ్రిడ్జి) పనులకు రాజకీయ దురుద్దేశంతో కొందరు అడ్డుపడుతున్నారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం గద్వాలలో ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ నాగమణి, మార్కెట్ యార్డ్ చైర్మన్ రహమత్ తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ఆత్మకూరు, గద్వాల ప్రాంతాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆత్మకూరు ప్రజలు గద్వాల రావాలంటే జూరాల ప్రాజెక్టు మీదుగా లేదా ఇతర మార్గాల ద్వారా సుమారు 33 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని, ఈ కొత్త బ్రిడ్జి పూర్తయితే ఆ దూరం కేవలం 7 నుండి 8 కిలోమీటర్లకు తగ్గిపోతుందని వివరించారు. దీనివల్ల సమయం, ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా రెండు ప్రాంతాల మధ్య రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని తెలిపారు.
అభివృద్ధికి అడ్డుపడొద్దు
జూరాల ప్రాజెక్టు భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం డౌన్ స్ట్రీమ్ లో కిలోమీటర్ దూరంలో ఈ హై-లెవల్ బ్రిడ్జిని మంజూరు చేసిందని ఆయన పేర్కొన్నారు. అయితే, కొందరు కావాలనే తప్పుడు స్టేట్‌మెంట్లు ఇస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. "కొందరు దుష్టశక్తులు ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగితే తమకు భవిష్యత్తు ఉండదని భయపడుతున్నారు. కానీ ప్రజలందరూ ఈ బ్రిడ్జి కావాలని కోరుకుంటున్నారు," అని ఆయన వ్యాఖ్యానించారు.
సకాలంలో పూర్తి చేస్తాం
ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ప్రజా మద్దతుతో నిర్ణీత సమయంలోనే ఈ వారధి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల గద్వాల, ఆత్మకూరుతో పాటు కర్నూలు, మంత్రాలయం, హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ నాగమణి మాట్లాడుతూ.. బ్రిడ్జి నిర్మాణం ఆత్మకూరు పట్టణ అభివృద్ధికి ఒక మైలురాయి అని, దీనిపై రాజకీయం చేయొద్దని కోరారు.
అభివృద్ధిని అడ్డుకుంటే భవిష్యత్తు ఉండదు : చైర్‌పర్సన్ నాగమణి
ఆత్మకూరు మున్సిపల్ చైర్‌పర్సన్ గాయత్రి నాగమణి మాట్లాడుతూ.. "మా ఆత్మకూరు పట్టణ అభివృద్ధికి ఈ బ్రిడ్జి ఎంతో కీలకం. గత పదేళ్లలో జరగని అభివృద్ధి ఇప్పుడు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో జరుగుతోంది. ప్రజలందరూ ఈ బ్రిడ్జి నిర్మాణం కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో కొందరు రాజకీయ నేతలు తమ ఉనికి కోసం దీనిని అడ్డుకోవాలని చూడటం బాధాకరం. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎమ్మెల్యే నాయకత్వంలో ఈ వారధిని నిర్మించి తీరుతాం," అని స్పష్టం చేశారు.
ప్రజల దశాబ్దాల కల : మార్కెట్ యార్డ్ చైర్మన్ రహమత్
ఆత్మకూరు మండల మార్కెట్ యార్డ్ చైర్మన్ రహమత్ మాట్లాడుతూ.. "ఈ బ్రిడ్జి ఈ ప్రాంత రైతులు, వ్యాపారుల దశాబ్దాల కల. జూరాల ప్రాజెక్టుపై వాహనాల రాకపోకలు ఆగిపోతే ఆత్మకూరు పరిస్థితి ఏమిటని భయపడేవారమని, ఇప్పుడు ప్రభుత్వం శాశ్వత పరిష్కారంగా ఈ కొత్త బ్రిడ్జిని మంజూరు చేయడం సంతోషకరం. ఇది పూర్తయితే కర్నూలు, మంత్రాలయం, హైదరాబాద్ వెళ్లే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అభివృద్ధికి అడ్డుపడే వారికి ప్రజలే బుద్ధి చెబుతారు," అని పేర్కొన్నారు. చైర్మన్ నాగులపల్లి నరేందర్, మున్సిపల్ కమిషనర్ నాగరాజ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డి, మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డులకు సంబంధించిన కౌన్సిలర్లు, అంగన్ వాడీ, ఆశ కార్యకర్తలు, కార్యాలయ సిబ్బంది పట్టణ ప్రజలు పాల్గొన్నారు.






