జోరుగా నల్లమట్టి దందా.. పర్మిషన్ ఒకచోట..తవ్వకాలు పలుచోట్ల

by Ajay Maddhiboyina |

మక్తల్ నియోజకవర్గంలో నల్లమట్టి, ఇసుక రవాణా ఇష్టారాజ్యంగా సాగుతోంది. మైనింగ్, టెండర్ల నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేసి, ఒక చెరువు అనుమతితో పది చెరువులను దోచేస్తున్నా ఇరిగేషన్ శాఖ కళ్లు మూసుకోవడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

జోరుగా నల్లమట్టి దందా.. పర్మిషన్ ఒకచోట..తవ్వకాలు పలుచోట్ల
X

దిశ,మక్తల్: మక్తల్ నియోజకవర్గంలో నల్లమట్టి, ఇసుక రవాణా ఇష్టారాజ్యంగా సాగుతోంది. మైనింగ్, టెండర్ల నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేసి, ఒక చెరువు అనుమతితో పది చెరువులను దోచేస్తున్నా ఇరిగేషన్ శాఖ కళ్లు మూసుకోవడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు, అధికారుల మామూళ్ల పర్వంతో మక్తల్‌లో మట్టి దందా అడ్డూఅదుపూ లేకుండా సాగుతోంది.

పొలాలకు కాకుండా.. బట్టీలకు!

నిజానికి చెరువుల్లోని నల్లమట్టిని కేవలం వ్యవసాయ పొలాల సారవంతం కోసమే తరలించాలనే నిబంధన ఉంది. కానీ, మక్తల్ నియోజకవర్గంలో ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. మాఫియా అడ్డదారుల్లో ఈ మట్టిని పెద్ద ఎత్తున ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకుంటోంది. సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు పర్మిషన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు తప్ప.. ఎంత మట్టి తరలుతోంది? ఎక్కడికి వెళ్తోంది? అనే పర్యవేక్షణే కరువైంది. గత పదేళ్లుగా ఇరిగేషన్ అధికారుల అండదండలతోనే ఇసుక, మట్టి మాఫియా ఇష్టారాజ్యంగా చెలరేగిపోతోందని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఎదురుతిరిగిన రైతాంగం

మాఫియా ఆగడాలపై మక్తల్ నియోజకవర్గ రైతాంగం తిరగబడుతోంది. ఇటీవల కర్ని చెరువులో మట్టి తీసేందుకు అనుమతి తెచ్చుకున్న మాఫియా సభ్యులు.. ఆ సాకుతో చుట్టుపక్కల చెరువుల్లోనూ తవ్వకాలు ప్రారంభించారు. దీనిని గమనించిన కర్ని గ్రామస్తులు మట్టి తరలింపు వాహనాలను అడ్డుకుని మాఫియాతో వాదోపవాదాలకు దిగారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

రాత్రికి రాత్రే రూట్ మార్చారు!

కర్ని గ్రామంలో గ్రామస్తులతో పాటు మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అక్రమ తవ్వకాలను నిలదీయడంతో అధికారులు ఆగమేఘాలపై స్పందించారు. అయితే అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. రాత్రికి రాత్రే అక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్యవార్ గ్రామం చెరువుల నుంచి మట్టి తరలించుకోవడానికి పర్మిషన్లు మార్చేసి తమ కృతజ్ఞత చాటుకున్నారు. ఏ ఏ గ్రామ పంచాయతీల్లో అనుమతులు ఇచ్చారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే నిలదీయగా.. ఇరిగేషన్ అధికారులు దాటవేయడం గమనార్హం.

నిబంధనలు గాలికి..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెరువుల్లో నల్లమట్టి తీయాలంటే గ్రామపంచాయతీ పరిధిలో టెండర్లు వేయాలి. మైనింగ్ శాఖ నిర్దేశించిన ధర కంటే ఎక్కువ పాడిన వారికే అవకాశం ఇవ్వాలి. తవ్వకాలు కూడా 2 మీటర్ల లోతు, 100 మీటర్ల పొడవుకు మించకూడదు. ఇటుక బట్టీలకు తరలించాలంటే ప్రభుత్వ ప్రత్యేక అనుమతి ఉండాలి. టెండర్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని సదరు పంచాయతీలు చెరువుల అభివృద్ధికి వాడుకోవాలి. కానీ మక్తల్‌లో ఈ రూల్స్ అన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి.

మంత్రి ఆగ్రహం?

చెరువులను సంరక్షించాల్సిన అధికారి తీరుపై అటు ప్రజాప్రతినిధులు, ఇటు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు అధికారి వ్యవహారశైలిపై రాష్ట్ర మంత్రి శ్రీహరి సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి మక్తల్ నల్లమట్టి దోపిడీపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story