సదరం సర్టిఫికెట్ కి బదులుగా ఈ కార్డు తీసుకోండి : కలెక్టర్

by Naveena |

దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి దివ్యాంగునికి సదరం సర్టిఫికెట్ కు బదులుగా యూనిక్ డిసేబిలిటీ ఐడి (యూడిఐడి) కార్డును కేటాయించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.

సదరం సర్టిఫికెట్ కి బదులుగా ఈ కార్డు తీసుకోండి : కలెక్టర్
X

దిశ, గద్వాల కలెక్టరేట్ : దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి దివ్యాంగునికి సదరం సర్టిఫికెట్ కు బదులుగా యూనిక్ డిసేబిలిటీ ఐడి (యూడిఐడి) కార్డును కేటాయించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో దివ్యాంగులకు యూనిక్ డిసేబిలిటీ ఐడెంటిటీ కార్డు (యూడిఐడి) జారీ విధానంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దివ్యాంగులకు ఉద్యోగ, ఉపాధి, విద్య, పెన్షన్ల కోసం దేశవ్యాప్తంగా ప్రయోజనం పొందే విధంగా సదరం సర్టిఫికెట్ కు బదులు యూనిక్ డిసేబిలిటీ ఐడీ కార్డును ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్డు దేశవ్యాప్తంగా ఉపయోగపడుతుందని తెలిపారు. మార్చి 2025 నుండి 21 రకాల అంగవైకల్యాలకు సంబంధించి యూడిఐడి పోర్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇంతకు ముందు సదరం క్యాంపుల ద్వారా 7రకాల అంగవైకల్యాలకు మాత్రమే సర్టిఫికెట్లు జారీ చేయబడేవని అన్నారు. ఇకనుండి సదరం బదులు యూడిఐడి పోర్టల్ లో లబ్దిదారులు స్యయంగా గానీ, లేదా మీ సేవ కేంద్రాల ద్వారా గానీ వారి పూర్తి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు యూడిఐడి కార్డులు స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా నేరుగా దివ్యాంగుల చిరునామాకు చేరుతాయన్నారు లేదా స్వయంగా ఆన్ లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.

ఇప్పటికే సదరం సర్టిఫికేట్ ఉన్న దివ్యాంగులు తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్, ఇతర ప్రయోజనాలను రాష్ట్రంలో యధావిధిగా పొందగలుగుతారని, అయితే ఇతర రాష్ట్రాల్లో ఏదైనా సౌకర్యం పొందాలంటే యూడిఐడి కార్డు తప్పనిసరి అని తెలిపారు. మార్చి 1, 2025 నుండి కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు యూడిఐడి పోర్టల్ www.swavlambancard.gov.in ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇకపై సదరం సర్టిఫికేట్ జారీ చేయబోరని తెలియజేశారు. తాత్కాలిక అంగ వైకల్యము ఉన్న దివ్యాంగులు తమ సదరం సర్టిఫికెట్ రెన్యువల్ చేసుకునేటప్పుడు కచ్చితంగా యూడిఐడి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఉన్న మీసేవ కేంద్రాల నిర్వాహకులు, యూడిఐడి దరఖాస్తుల నమోదుపై అవగాహన కల్పించాలని సూచించారు.

దివ్యాంగులకు సమర్థవంతంగా సేవలను అందించినట్లయితే అర్హులైన ప్రతి దివ్యాంగుడు ప్రభుత్వ పథకాలను సులభంగా పొందేందుకు యూడిఐడి కార్డు ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. మండలాల్లో ఎంపీడీవోలు, ఎంపీయం లు దివ్యాంగులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, డిడబ్ల్యూఓ సునంద, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిర, ఇంచార్జ్ డిపిఓ నాగేంద్రం, ఎంపీడీవోలు, ఏపీఎంలు, మీసేవ కేంద్రాల నిర్వాహకులు, విఓఏలు, తదితరులు పాల్గొన్నారు.

Next Story