- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు : మంత్రి జూపల్లి కృష్ణారావు
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు.

దిశ, వనపర్తి : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని కల్యాణ సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో యాసంగి-వరి, మొక్కజొన్న కొనుగోళ్లపై మంత్రి జూపల్లి కృష్ణరావు వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, దేవరకద్ర శాసన సభ్యులు మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి పౌర సరఫరా అధికారులు మిల్లర్లు,ట్రాస్పోర్టర్ల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణరావు మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజకు గిట్టుబాటు ధర కల్పించి, అన్నదాతలను ఆదుకోవడమే రాష్ట్ర ప్రభుత్వలక్ష్యమని అన్నారు. రైతులు,కొనుగోలుదారులు, రైస్ మిల్లర్లు సమన్వయంతో వ్యవహరించాలన్నారు.కొనుగోలు ప్రక్రియలో ఎవరూ ఎవరినీ బతిమాలుకునే అవసరం లేదని కొనుగోలు కేంద్రంలోనే నిబంధనల ప్రకారం వడ్లు నాణ్యత చూసుకొని తూకం చేసి రైతుకు అక్కడే రశీదు ఇవ్వాలన్నారు.రైతులు లారీల వెంబడి,మిల్లుకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వడ్లు నాణ్యతను బట్టి తరుగు, తాలు,కొనుగోలు కేంద్రంలోనే జరగాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ లారీ మిల్లుకు వచ్చిన తర్వాత తరుగు అనే మాట మాట్లాడకుండా వడ్లు దించుకోవాలని మిల్లర్లను ఆదేశించారు.ఎఫ్.సి.ఐ.కి ఇచ్చే 68 కిలోల బియ్యంలో నూకలు, సరిగ్గా గింజలు నిండనివి, ఇతరత్రా కలుపుకొని దాదాపు 23 శాతం ఉంటుందని అందువల్ల మిల్లర్లు నష్టపోయే అవకాశమే లేదని, రైతులకు సహకరించి వారిని ఇబ్బంది పెట్టవద్దని కోరారు.
తరుగు పేరుతో ఇబ్బంది పెట్టొదు : ఎమ్మెల్యే మేఘా రెడ్డి
వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ ఐ.కే.పి.,రైతు సహకార సంఘం కొనుగోలు కేంద్రాల వద్ద తాలు, తేమ, చెత్త అన్ని చూసి వడ్లు తూకం వేస్తారని, లారీ ఎక్కించిన తర్వాత గోదాం వద్ద, మిల్లు వద్ద 4-6 కిలోల తరుగు తీస్తాం అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటని, ఆ హక్కు ఎవరిచ్చారని గోదాం సిబ్బందిని, మిల్లర్లను ప్రశ్నించారు. అన్నం పెట్టే రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు సకాలంలో కొనుగోలు చేయాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం తో పాటు ప్రజా ప్రతినిధులపై ఉందని గుర్తు చేశారు.జిల్లా యంత్రాంగం కమిటీ ఏర్పాటు చేసుకొని రాబోయే 10-12 రోజులు ధాన్యం కొనుగోలు పైనే దృష్టి సారించాలని కోరారు. మిల్లులో ధాన్యం దించుకోవడం లేదా లోడ్ చేయడంలో హమాలీల ఆవశ్యకత చాలా ఉంటుందని,జిల్లాలో ఉన్న మొత్తం హమాలీలు ఎంతమంది ఉన్నారు, రిజిస్టర్ చేసుకున్న వారి వివరాలు తీసుకొని అందరిని ధాన్యం కొనుగోలు లో కేటాయించాలని కలెక్టర్ ను సూచించారు.మిల్లర్లు సైతం రైతుల పట్ల పెద్ద మనసు చేసుకొని రైతులకు ఇబ్బందులకు గురి చేయకుండా వడ్లు దించుకోవాలని కోరారు.
ధాన్యం కొనుగోళ్లను ఆలస్యం చేయవద్దు - దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ స్వయంగా రైతు బిడ్డ అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ఎజెండాగా పనిచేస్తూ ఆదేశాలు ఇస్తున్నారని వెల్లడించారు. వడ్లు కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ రోజులు ఉంచడం వల్ల సాధారణ 14 శాతం తేమ కంటే మరింత తగ్గిపోయి లేదా అకాల వర్షాలు పడి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని అందువల్ల మిల్లర్లు పెద్ద మనసు చేసుకొని వచ్చిన లారీలను తక్షణమే దించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పటిష్టమైన చర్యలు చెపడుతున్నాం : కలెక్టర్ ఆదర్శ్ సురభి
కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో సుమారు 2.5 నుండి 3 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేయడం జరిగిందని ఇప్పటివరకు దాదాపు 1.20 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చినట్లు తెలిపారు. ఇందులో ఇప్పటివరకు 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని మిగిలిన వాటిని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేసేందుకు రోజుకు పది వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి దృష్టికి తెచ్చారు.మిల్లుకు పంపిన ధాన్యం లారీల నుండి ధాన్యం దించుకోవడంలో మిల్లర్లు తరుగు పేరుతో కొంత ఇబ్బందులు పెడుతున్నారని అందువల్ల ప్రతి మిల్లుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలియజేశారు. మిల్లులో త్వరగా వడ్లు దించుకోకపోవడం వల్ల ట్రాన్స్పోర్ట్ సమస్య సైతం ఏర్పడుతుందని తెలియజేశారు.రానున్న 10-12 రోజుల్లో రైతులు పండించిన మొత్తం వడ్లు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని భరోసా కల్పించారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ , మార్కెట్ కమిట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మాధవి, గ్రంథాలయ చైర్మన్ గోవర్ధన్ సాగర్, సివిల్ సప్లైస్ అధికారులు, మార్కెటింగ్, రవాణా శాఖల అధికారులు, రైస్ మిల్లుల ప్రతినిధులు, వడ్లు కొనుగోలు కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.






