విధి నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు : క‌లెక్ట‌ర్ హేమంత కేశ‌వ్ పాటిల్

by Nallavelli.Anjaneyulu |

నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు.

విధి నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు : క‌లెక్ట‌ర్ హేమంత కేశ‌వ్ పాటిల్
X

దిశ, కందనూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వైద్య సేవల అమలుపై అంశాల వారీగా ప్రతిరోజూ సమీక్షలు నిర్వహిస్తానని, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలలో అందిస్తున్న సేవలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. ప్రజలకు సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ప్రత్యేకంగా తల్లి, శిశు ఆరోగ్యంపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.

గర్భిణీల నమోదు, క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు, ప్రసవానికి ముందు,తర్వాత అవసరమైన వైద్య సేవలు అందించడంలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. జిల్లాలో తల్లి మరణాలు, శిశు మరణాలు సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టి, ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యతతో పర్యవేక్షించాలని ఆదేశించారు. హై రిస్క్ గర్భిణీలను గుర్తించి వారికి ప్రత్యేక వైద్య సేవలు అందించాలని, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, వైద్యాధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేసి, ప్రజల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని తెలిపారు. సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల నియంత్రణపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలను ముందుగానే అమలు చేయాలని ఆదేశించారు.

లక్ష్య సాధనలో వెనకబడితే చర్యలు..

ఆరోగ్య సూచికలను మెరుగుపరిచడంలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పని చేసి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలన్నారు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం వహించిన అధికారులు, సిబ్బందిపై అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ హెచ్చరించారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా కృషి చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ, ఇమ్యునైజేషన్ అధికారి రవికుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Next Story