- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీ అయ్యప్ప డెవలపర్స్ వెంచర్ దందా!
లింగోటం పరిధిలోని పల్కపల్లి రోడ్డులో అనుమతులు లేకుండానే వెంచర్ ఏర్పాటు చేశారు.

దిశ, అచ్చంపేట: నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని లింగోటం గ్రామపంచాయతీ పరిధిలోని పల్కపల్లి రోడ్డులో అభివృద్ధి చేస్తున్న శ్రీఅయ్యప్ప డెవలపర్స్ వెంచర్‌పై ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ప్లాట్ల దందా కొనసాగుతోందనే ఆరోపణలపై గ్రామపంచాయతీ చర్యలకు పూనుకుంది. ఈ వెంచర్‌కు సంబంధించిన అనుమతి పత్రాలు ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీయగా, పంచాయతీ రికార్డులలో ఎక్కడా కూడా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఇటీవల బదిలీపై వచ్చిన పంచాయతీ కార్యదర్శి అవాక్కయ్యారు. గతంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి అందుకు సంబంధించిన ఎలాంటి రికార్డులు నిర్వహించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
పత్రాలు సమర్పించాలని ఆదేశం...
నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండానే వెంచర్ ఏర్పాటు చేసి ప్లాట్లు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో సోమవారం గ్రామపంచాయతీ కార్యదర్శి అధికారికంగా నోటీసులు జారీ చేశారు. సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందకుండానే వెంచర్ నిర్వాహకులు అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని కార్యదర్శి నోటీసులో పేర్కొన్నారు. దీంతో వెంటనే పనులు నిలిపివేసి, మూడు రోజుల్లోపు అన్ని అనుమతి పత్రాలు, సంబంధిత డాక్యుమెంట్లను గ్రామపంచాయతీ కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు. నోటీసులో పేర్కొన్న గడువులోపు వివరణ ఇవ్వకపోతే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసులో స్పష్టం చేశారు. ఈ నోటీసు ప్రతులను ఉన్నతాధికారులైన ఎంపీడీవో, ఎంపీఓలకు కూడా సమాచారం నిమిత్తం పంపించారు.
గడువుతో కూడిన నోటీసులు జారీ...
ఈ విషయమై గ్రామపంచాయతీ కార్యదర్శి రమేష్‌ను ‘దిశ’ ఫోన్ ద్వారా మంగళవారం వివరణ కోరగా.. లింగోటం గ్రామపంచాయతీ పరిధిలోని అయ్యప్ప డెవలపర్స్‌కు నోటీసులు జారీ చేసిన విషయం వాస్తవమేనని స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా ఈ వెంచర్‌కు సంబంధించిన అనుమతులపై పలు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. సంబంధిత డెవలపర్లను పత్రాలు సమర్పించాలని పలుమార్లు కోరినప్పటికీ నిర్వాహకులు కాలయాపన చేస్తుండడంతోనే అధికారికంగా నోటీసులు జారీ చేశామన్నారు. అంతేకాకుండా వెంచర్‌కు సంబంధించిన ఎలాంటి అనుమతి పత్రాలు గ్రామపంచాయతీ కార్యాలయంలో కూడా అందుబాటులో లేవని వెల్లడించారు. పంచాయతీ కార్యదర్శి చర్యలతో సదరు వెంచర్ చట్టబద్ధతపై ప్రస్తుతం స్థానికంగా పెద్దఎత్తున చర్చ నడుస్తోంది.






