‘పుష్ప’ తరహాలో అక్రమ రవాణా..ఆంధ్రప్రదేశ్‌కు ఇసుక తరలింపు

by velandi.Saikiran |   (  Updated:2026-02-26 22:16:06  IST  )

సుంకేసుల బ్యారేజీ కేంద్రంగా తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఇసుక మాఫియా యథేచ్ఛగా అక్రమ రవాణా సాగిస్తోంది.

‘పుష్ప’ తరహాలో అక్రమ రవాణా..ఆంధ్రప్రదేశ్‌కు ఇసుక తరలింపు
X

సుంకేసుల బ్యారేజిపై ఇసుక మాఫియా హల్ చల్

‘పుష్ప’ తరహాలో అక్రమ రవాణా

ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిరోజూ వందలాది ట్రాక్టర్లలో ఇసుక తరలింపు

నది ఒడ్డునే జేసీబీలతో అక్రమంగా తవ్వకాలు

ఈ దందాపై అధికారుల పర్యవేక్షణ లోపం

రాత్రి వేళల్లో చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు లేకపోవడంపై అనుమానాలు

దారిమళ్లుతున్న రూ.కోట్ల ఆదాయం

సుంకేసుల బ్యారేజీ కేంద్రంగా తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఇసుక మాఫియా యథేచ్ఛగా అక్రమ రవాణా సాగిస్తోంది. ప్రతిరోజూ వందలాది ట్రాక్టర్లు వరుస కట్టి సరిహద్దు దాటుతుండడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. నేరుగా జేసీబీలతో నది ఒడ్డున తవ్వకాలు జరుపుతూ సినిమా తరహాలో సాగుతున్న ఈ దందా స్థానికులను కలవరపెడుతోంది. నెలల తరబడి ఈ వ్యవహారం నడుస్తున్నా చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు లేకపోవడం అధికారుల పర్యవేక్షణ లోపాన్ని సూచిస్తోంది. రాత్రివేళల్లో భారీగా ట్రాక్టర్లు దూసుకుపోతున్నా సంబంధిత శాఖలు నిశ్శబ్దంగా ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవస్థీకృత మాఫియాగా సాగుతున్న ఈ అక్రమాలను అరికట్టేందుకు అధికారులు తక్షణమే ప్రత్యేక దళాలతో నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వ సంపదను కాపాడాలని రాజోలి మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

దిశ, రాజోలి : సుంకేసుల బ్యారేజీ మీదుగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా చూస్తుంటే అది సినిమా కాదు, నిజజీవిత థ్రిల్లర్ అనిపిస్తోంది. రాత్రింబవల్లు నిశ్శబ్దంగా తెలంగాణ సరిహద్దు దాటి ఆంధ్రప్రదేశ్ వైపు ప్రతిరోజూ వందలాది ట్రాక్టర్లు ఇసుక తరలిస్తున్నాయి. కేవలం ట్రాక్టర్లతో తరలింపే కాదు, నేరుగా జేసీబీలు ఉపయోగించి నది ఒడ్డునే ఇసుక తవ్వి, ట్రాక్టర్లలో లోడ్ చేసి సరిహద్దు దాటిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

అధికారుల పర్యవేక్షణ లోపం...

స్థానికుల సమాచారం ప్రకారం, ఈ దందా నెలల తరబడి కొనసాగుతున్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ మాత్రం కనిపించడం లేదు. రాత్రివేళల్లో భారీగా ట్రాక్టర్లు వరుసగా వెళ్తున్నా ఎవరూ ఆపకపోవడం, చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు లేకపోవడం ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. ప్రభుత్వానికి రావాల్సిన రూ.కోట్ల ఆదాయం అక్రమ మార్గాల్లో మాయమవుతుండగా, సంబంధిత శాఖలు నిశ్శబ్దంగా ఉండడంపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంత పెద్దఎత్తున అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులకు తెలియదా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మాఫియా దందా.. కఠిన చర్యల డిమాండ్

ఇది వ్యవస్థీకృతంగా నడుస్తున్న మాఫియా కార్యకలాపంలా కనిపిస్తోందని ప్రజలు అంటున్నారు. ట్రాక్టర్లు గుంపులుగా కదులుతూ సరిహద్దు దాటడం చూస్తే, ఇది సాధారణ అక్రమం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. వెంటనే ప్రత్యేక దళాలతో తనిఖీలు నిర్వహించి, అక్రమ రవాణాలో పాల్గొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటారా? లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది.

Next Story