భరోసాకు హోల్డ్...గందరగోళంలో రైత‌న్న‌!

by velandi.Saikiran |   (  Updated:2026-03-25 21:01:17  IST  )

రైతు భరోసా పథకం కింద నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతుండగా, బ్యాంకర్ల చర్యలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

భరోసాకు హోల్డ్...గందరగోళంలో రైత‌న్న‌!
X

భరోసాకు హోల్డ్!

- ముందస్తు నోటీసులు లేకుండా ఖాతాల నిలిపివేత

- బ్యాంకుల చర్యలతో రైతుల్లో గందరగోళం

- జీరో బ్యాలెన్స్ చూపించడంతో ఆందోళన

దిశ, నవాబుపేట: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతుండగా, బ్యాంకర్ల చర్యలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఖాతాల్లో డబ్బులు జమ అయిన వెంటనే వాటిని హోల్డ్‌లో పెట్టి జీరో బ్యాలెన్స్ చూపించడం వల్ల రైతులు గందరగోళానికి గురవుతున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఖాతాలను నిలిపివేయడం రైతుల్లో అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇటీవల సైబర్ నేరాలు పెరిగిన నేపథ్యంలో, తమ ఖాతాలు హ్యాకింగ్‌కు గురయ్యాయేమోనని భయంతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో తమ ఖాతాలను హోల్డ్ లో పెట్టింది “బ్యాంకర్లా..? హ్యాకర్లా..?” సైబర్ నేరగాళ్ల అన్న సందేహం రైతుల్లో బలంగా వినిపిస్తోంది. ప్రధానంగా ప్రజల డిపాజిట్లను భద్రంగా నిర్వహించడం, అవసరమైనప్పుడు లావాదేవీలు సజావుగా జరిగేలా చూడడం, రుణాల వసూలు విషయంలో పారదర్శక విధానాలు పాటించడం వంటి బాధ్యతలు బ్యాంకులు నిర్వర్తించాలి. ముఖ్యంగా ప్రభుత్వం జమ చేసే సంక్షేమ నిధులను లబ్ధిదారులునిరభ్యంతరంగా వినియోగించుకునేలా చూడటం కూడా బ్యాంకుల నైతిక బాధ్యతగా భావించబడుతోంది.

అయితే వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. బ్యాంకులు మొండిబకాయిల పేరుతో ఖాతాలను హోల్డ్‌లో పెట్టి, అందులో గతంలో తాము జమ చేసిన డబ్బులు, ఇతరత్రా తమ ఖాతాలలో జమ అయిన డబ్బులను, ఇటీవల జమ అయిన రైతుబంధు నిధులను కూడా వినియోగించుకోనీయకుండా అడ్డుకుంటున్నాయి. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, అకస్మాత్తుగా ఖాతాలను నిలిపివేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు మాత్రం తమకు కొంత గడువు ఇస్తే బకాయిలను వడ్డీతో సహా చెల్లిస్తామని, కనీసం ప్రభుత్వం జమ చేసిన నిధులను వినియోగించుకునే అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు. అయినా వారి వినతులు ఏమాత్రం పట్టించుకోని బ్యాంకర్ల కఠిన వైఖరి కారణంగా రైతులు ఆందోళనలకు గురికావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ సమస్య రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. బ్యాంకర్ల చర్యల వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభ, విధాన సభల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. రైతు భరోసా నిధులపై బ్యాంకులు హోల్డ్‌లు విధించకుండా నిరోధించేలా స్పష్టమైన చట్టం తీసుకురావాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. అందుకుచట్టపరమైన మార్పులే పరిష్కారమని

నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. సంక్షేమ పథకాల నిధులను “ప్రొటెక్టెడ్ అమౌంట్”గా గుర్తించి, ఖాతాలను హోల్డ్‌లో పెట్టే ముందు తప్పనిసరిగా నోటీసులు ఇవ్వాలని, గడువు ఇవ్వకుండా నిధులను నిలిపివేయడాన్ని నిషేధించాలని, బ్యాంకర్ల విచక్షణాధికారాలకు స్పష్టమైన పరిమితులు విధించాలని రైతుల కోరుతున్నారు. ఈ విధంగా చట్టపరమైన మార్పులు తీసుకురాకపోతే, రైతులు మరింత ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.రైతు భరోసా నిధులు రైతుల అవసరాల కోసం సమయానికి వినియోగం కావాలంటే, బ్యాంకుల ఇష్టారాజ్యానికి చెక్ పెట్టేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నదాతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. లేదంటే బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story