కర్ణాటక డ్యాముల్లో నిండుకుండలా కృష్ణమ్మ

by velandi.Saikiran |   (  Updated:2026-07-16 23:31:00  IST  )

వర్షాకాలం ప్రారంభంలో కురిసిన కొద్దిపాటి వర్షాలకు కృష్ణానది పరివాహక ప్రాంత రైతులు ఉన్న కాస్త నీటితోనే నారుమళ్లు పోసుకున్నారు.

కర్ణాటక డ్యాముల్లో నిండుకుండలా కృష్ణమ్మ
X

మహారాష్ట్ర, కర్ణాటక కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నా దిగువన ఉన్న తెలంగాణకు మాత్రం కృష్ణమ్మ కరుణ లభించడం లేదు. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు వరద నీటితో కళకళలాడుతున్నప్పటికీ, కన్నడ పాలకులు చుక్క నీటిని కూడా కిందికి వదలడం లేదు. దీంతో తెలంగాణ సరిహద్దుల్లో కృష్ణానది పూర్తిగా అడుగంటి, నీళ్లు లేక రాళ్లు తేలి వెలవెలబోతుండడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. గత ఏడాది జూలైలోనే జూరాల సహా అన్ని ప్రాజెక్టులు నిండి ప్రవహించగా ఈ ఏడాది జూలై సగం గడుస్తున్నా నదిలోకి వరద రాకపోవడం గమనార్హం. అప్పులు చేసి పోసిన వరి నారుమళ్లు నాటడానికి సిద్ధంగా ఉన్నా, సాగు నీరు లేక మక్తల్ నియోజకవర్గ రైతులు కర్ణాటక వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నందున, రాష్ట్ర మంత్రులు తక్షణమే చర్చలు జరిపి జూరాల, భీమా ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయించాలని కోరుతున్నారు.

దిశ, మక్తల్ : మహారాష్ట్ర, కర్ణాటక కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నా దిగువన ఉన్న తెలంగాణకు మాత్రం కృష్ణమ్మ కరుణ లభించడం లేదు. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు వరద నీటితో కళకళలాడుతున్నప్పటికీ, అక్కడి నుండి చుక్క నీటిని కూడా కిందికి వదలడం లేదు. దీంతో తెలంగాణ సరిహద్దుల్లో కృష్ణా నది పూర్తిగా అడుగంటి, నీళ్లు లేక రాళ్లు తేలి వెలవెలబోతోంది. ఎగువ నుంచి వరద వస్తే తప్ప నదికి జీవకళ వచ్చే పరిస్థితి లేదు. గత కొన్ని సంవత్సరాలుగా కర్ణాటక ప్రభుత్వం కృష్ణా నదిపై వరుసగా ‘రోడ్ కం బ్యారేజీలు’ నిర్మించి నీటిని ఒడిసిపడుతుండడంతో దిగువకు నీటి జాలు కనబడడం లేదు. తమ రాష్ట్రంలోని అన్ని బ్యారేజీలు, డ్యామ్‌లు పూర్తిగా నిండేవరకు పొరుగు రాష్ట్రాలకు నీటిని వదలకూడదనే కఠినమైన వైఖరిని కన్నడ పాలకులు (ఏ పార్టీ అధికారంలో ఉన్నా) అవలంబిస్తుండడంతో తెలంగాణ రైతాంగం కర్ణాటక వైపు ఆశగా ఎదురుచూడాల్సి వస్తోంది.

గతేడాది జూలైలోనే జలకళ.. ఈసారి కటకట..

గత ఏడాది జూలై నెలలోనే తెలంగాణలోని కృష్ణా ప్రాజెక్టులన్నీ నిండి, భారీగా వరద నీరు దిగువన ఉన్న ఆంధ్ర ప్రాంతానికి సైతం చేరుకునేది. ప్రాజెక్టులన్నీ పుష్కలమైన టీఎంసీల నీటి నిల్వలతో దర్శనమిచ్చేవి. కానీ, ఈ ఏడాది జూలై సగం గడుస్తున్నా పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్ సుమారు 67శాతం నీటి నిల్వతో ఉంది. అక్కడికి ఏకంగా 1,33,500 క్యూసెక్కుల భారీ ఇన్‌ఫ్లో వస్తుండగా.. అవుట్‌ఫ్లో మాత్రం కేవలం 0 నుంచి 500 క్యూసెక్కుల లోపే ఉంచడం గమనార్హం. ఆల్మట్టి నుంచి విడుదలయ్యే నీటిపైనే ఆధారపడే నారాయణపూర్ (బసవసాగర్) డ్యామ్‌లోకి కూడా గణనీయమైన వరద నీటి విడుదల లేదని అక్కడి అధికారులు చెబుతున్నారు.

నారుమళ్లు సిద్ధం.. నాట్లకు నీరేది?...

వర్షాకాలం ప్రారంభంలో కురిసిన కొద్దిపాటి వర్షాలకు కృష్ణానది పరివాహక ప్రాంత రైతులు ఉన్న కాస్త నీటితోనే నారుమళ్లు పోసుకున్నారు. ఇప్పుడు వరి నాట్లు వేసే సమయం దగ్గరపడుతున్నా నదిలోకి వరద రాకపోవడంతో తమ పరిస్థితి ఏమిటని మక్తల్ నియోజకవర్గంలోని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రైతులు ఆకాశం వైపు కాకుండా, కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల గేట్లు ఎప్పుడు ఎత్తుతుందా? అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వర్షాకాలంలో రెండు నెలలు గడిచిపోయినా కృష్ణా, భీమా నదులకు వరద నీరు రాకపోవడంతో ఈసారి ఖరీఫ్ పంటపై ఆశలు వదులుకోవాల్సిందేనా అని అన్నదాతలు దిగులు చెందుతున్నారు.

ప్రభుత్వాలు స్పందించి చర్చలు జరపాలి

పెద్ద ఎత్తున అప్పులు చేసి వరి విత్తనాలు తెచ్చి పోసిన నారుమళ్లు ఇప్పుడు నాటడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం అటు కర్ణాటకలోనూ, ఇటు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు. ఎగువన ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా ఉన్నందున, దిగువ నదుల్లోకి వరద నీటిని వదిలేలా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు మాట్లాడి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలా చేస్తేనే మక్తల్ నియోజకవర్గంలోని భీమా, జూరాల ప్రాజెక్టుల్లోకి నీరు చేరి ఈ ప్రాంత అన్నదాతలకు మేలు జరుగుతుందని వేడుకుంటున్నారు.

Next Story