దుందుభిలో మూడుముక్కలాట

by velandi.Saikiran |

నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలో దుందుభి నదిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ వద్ద మూడు ముక్కలాట కొనసాగుతుంది.

దుందుభిలో మూడుముక్కలాట
X

దుందుభిలో మూడుముక్కలాట

- ఉప్పునుంతలలో ఇసుక మాఫియా దందా

- మైనింగ్, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం కుమ్మక్కు

- ఆన్‌లైన్‌కు పాతర- ఆఫ్ లైన్‌లో తరలింపు

- ఎక్కడ పడితే అక్కడే డంపులు

- అక్రమానికి పూర్తి సహకారం అందిస్తున్న మైనింగ్ ఎస్ఓ

- ఒక్కో ట్రిప్‌నకు ఆయనకు 500 నజరానా

దిశ, ఉప్పునుంతల: ఇసుక మాఫియాను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చినా క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదు. నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలో దుందుభి నదిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ వద్ద మూడు ముక్కలాట కొనసాగుతుంది. మైనింగ్, రెవెన్యూ పోలీస్ అధికార యంత్రాంగం ఇసుక మాఫియాతో కుమ్మకై ఆన్ లైన్ ద్వారా ఇసుక తరలించాలని నిబంధనలను తుంగలో తొక్కుతున్నారని ప్రజలు వాపోతున్నారు.

బుకింగ్స్ రద్దుచేసి ప్రైవేటుగా అమ్మకాలు...

ఇల్లు నిర్మించుకునే సామాన్య లబ్ధిదారులు ఆన్‌లైన్ ద్వారా ఇసుక బుక్ చేసుకుంటే వారం రోజులైనా లారీ ఇంటికి రావడం లేదు. కానీ, అదే ఇసుక మాఫియా చేతిలోకి వెళ్తే గంటల్లోనే డెలివరీ అవుతోంది. ఇక్కడ జరుగుతున్న అసలు తంతు వేరు. లబ్ధిదారుల పేరిట బుకింగ్స్ పూర్తి చేసి, నదిలో లోడింగ్ పూర్తయిన తర్వాత ఆ బుకింగ్‌ను రద్దు చేస్తున్నారు. అనంతరం ఆ ఇసుకను ప్రైవేట్ వ్యక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కో ట్రిప్పుకు రూ.5వేల నుంచి రూ.6వేలు లాభాలు పొందుతున్నారు. ఒకవేళ ఎవరైనా లబ్ధిదారుడు నిలదీస్తే అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తేనే వస్తాం.. లేదంటే క్యాన్సిల్ చేసుకో అని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చక్రం తిప్పుతున్న మైనింగ్ ఎస్ఓ

రీచ్ వద్ద పర్యవేక్షించాల్సిన మైనింగ్ సెక్యూరిటీ ఆఫీసర్లు(ఎస్‌వోలు) అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లోడింగ్‌కు ముందే ఆన్‌లైన్ అనుమతి పత్రాలు చూడాల్సిన అధికారులు.. లోడింగ్ అయ్యాక బేరసారాలకు దిగుతున్నారు. ఒక్కో ట్రిప్పుకు రూ. 500 ముడుపులు తీసుకుంటూ, బుకింగ్స్ లేకపోయినా ఇసుకను బయటకు పంపిస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారం అక్కడ విధులు నిర్వర్తించే రెవెన్యూ, పోలీస్ సిబ్బందికి తెలిసినా.. 'మామూళ్ల' మత్తులో జోగుతూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పొలాల్లో ఇసుక డంపులు...

ఇసుకను నేరుగా లబ్ధిదారులకు చేరవేయకుండా రాత్రికి రాత్రే పొలాల్లో డంపు చేస్తున్నారు. అధికారులు నిఘా కోల్పోవడంతో మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అసలైన లబ్ధిదారులకు ఇసుక దొరక్క భవన నిర్మాణాలు ఆగిపోతుంటే, మాఫియా మాత్రం ఎలాంటి బుకింగ్స్ లేకుండానే ఇసుకను నిల్వ చేసి బ్లాక్ మార్కెట్‌లో సొమ్ము చేసుకుంటోంది. ఉన్నతాధికారులు స్పందించి దుందుభి తీరాన సాగుతున్న ఈ 'మూడు ముక్కలాట'కు ముగింపు పలకాలని ప్రజలు కోరుతున్నారు.

వారం రోజులైనా ఇసుక రాలే

- మేకల లక్ష్మమ్మ, ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారురాలు, జప్తి సదగోడు

గత నెల 24వ తేదీన 5 ట్రిప్పుల ఇసుక (5 క్యూబిక్ మీటర్ల)10349 చెల్లించి ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్నాను. వారం దాటినా ఇసుక రాలేదు. దుందుభి వాగుకు కూతవేటు దూరంలో జప్తి సదగోడులో తాను ఉన్నా ఇసుక అందలేదు. ఇసుక లేకపోవడంతో ఇంటి నిర్మాణం ఆగిపోయింది. కేవలం ఒక ట్రిప్పు మాత్రమే వేశారు. ఇంకా నాలుగు ట్రిప్పుల ఇసుక రావాలి. ఇదేమని అడిగితే వెయ్యి రూపాయలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకే తహసీల్దార్ కు ఫిర్యాదు చేసేందుకు వచ్చాను.

Next Story