ఎస్‌ఎల్‌బీసీ సొరంగం విషాదం.. మళ్లీ ప్రారంభమైన సర్వే చర్యలు

by Bhanu |

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదం నేపథ్యంలో ఫిబ్రవరి 22న జరిగిన ఘటన ఇంకా జ్ఞాపకాల్లోనే ఉంది. అచ్చంపేట వద్ద సొరంగం పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో ఎనిమిది మంది కార్మికులు మట్టిలో కూరుకుపోయారు.

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం విషాదం.. మళ్లీ ప్రారంభమైన సర్వే చర్యలు
X

దిశ, అచ్చంపేట : ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదం నేపథ్యంలో ఫిబ్రవరి 22న జరిగిన ఘటన ఇంకా జ్ఞాపకాల్లోనే ఉంది. అచ్చంపేట వద్ద సొరంగం పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో ఎనిమిది మంది కార్మికులు మట్టిలో కూరుకుపోయారు. ఈ ఘటనపై వెంటనే రక్షణ చర్యలు ప్రారంభమయ్యాయి. 65 రోజులపాటు సాగిన సహాయక ప్రయత్నాల్లో కేవలం ఇద్దరి మృతదేహాలే వెలికితీయగలిగారు. మిగతా ఆరుగురు కార్మికుల ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు.

సుమారు 600 మంది వేర్వేరు శాఖల సిబ్బంది ఈ ప్రమాదస్థలంలో 14వ కిలోమీటర్ లో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అయితే ప్రమాద ప్రాంతం నుండి 50 మీటర్ల దూరంలో "అతి ప్రమాదకర జోన్"గా గుర్తించడంతో అక్కడి పనులు ఆపేశారు. డి1-టి2 ప్రాంతాల్లో ప్రత్యేక అధికారి శివకుమార్ తోలేటి ఆధ్వర్యంలో కొద్దిరోజులపాటు మిగతా మృతదేహాల కోసం మళ్లీ ప్రయత్నాలు జరిపినా ఫలితం లేకపోయింది.

ఈ పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించి, మళ్లీ మూడు నెలల విరామం తర్వాత సహాయక చర్యలు కొనసాగిస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. తాజా పరిణామాల్లో, ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థ "నేషనల్ జియోలాజికల్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా" (ఎన్‌జీఆర్ఐ) బృందం, రాష్ట్ర నీటి పారుదల శాఖతో కలిసి ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తోంది.

సర్వేపై దృష్టి ..

14వ కిలోమీటర్ వద్ద జరిగిన ప్రమాద ప్రాంతాన్ని కేంద్ర, రాష్ట్ర యంత్రాంగాలు కలసి ఆధునిక పద్ధతుల్లో విశ్లేషణ చేస్తున్నాయి. వైమానిక దళ హెలికాప్టర్, లైడార్ సర్వే ఆధ్వర్యంలో ప్రొఫెసర్ తివారి నేతృత్వంలో సర్వే పనులు కొనసాగుతున్నాయి. డెన్మార్క్ దేశానికి చెందిన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పరికరాల సహాయంతో భూమి లోపల పొరలు, షీర్ జోన్లు, భూమి కదలికల పరిస్థితిని అంచనా వేయడానికి సిద్ధమవుతున్నారు.

ప్రధానంగా ఎస్‌ఎల్‌బీసీ ముఖద్వారం అయిన అచ్చంపేట మండలంలోని మన్నెవారిపల్లి, అమ్రాబాద్ మండలంలోని నల్లవాగు, మల్లెతీర్థం ప్రాంతాల్లో సర్వేలు చేపట్టాలని ప్రణాళిక రూపొందించబడింది. ప్రస్తుతం మన్నెవారిపల్లి వద్ద గత రెండు రోజులుగా ఈ సర్వే ప్రారంభమైయింది. ఈ పరిశీలనను అధికార యంత్రాంగం గోప్యతతో నెమ్మదిగా చేపడుతోంది.

Next Story