- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళల భద్రతకు భరోసా
మహిళల భద్రతకు భరోసా కేంద్రం అండగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ హేమంతా కేశవ్ పాటిల్ అన్నారు.

దిశ, కందనూల్ : మహిళల భద్రతకు భరోసా కేంద్రం అండగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ హేమంతా కేశవ్ పాటిల్ అన్నారు. నాగర్ కర్నూల్ పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణను మరింత పటిష్టం చేయడంతో పాటు మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన సేవలను విస్తరించే లక్ష్యంతో ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, భరోసా కేంద్రం నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించేందుకు ప్రక్రియను జిల్లా యంత్రాంగం వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ మున్సిపల్ పరిధిలోని కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ శుక్రవారం పరిశీలించారు. ప్రతిపాదిత స్థలంలోని భౌగోళిక పరిస్థితులు, రహదారి అనుసంధానం, భూమి విస్తీర్ణం, ప్రజలకు అందుబాటు వంటి అంశాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు.
ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, భరోసా కేంద్రం నిర్మాణానికి అవసరమైన భూమి విస్తీర్ణంపై అధికారులతో చర్చించిన కలెక్టర్, స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సర్వే నంబర్లు, ప్రభుత్వ యాజమాన్య హక్కులు, మొత్తం భూమి విస్తీర్ణం, హద్దులు, సరిహద్దుల వివరాలను త్వరితగతిన అందించాలని సూచించారు. నిర్మాణాలకు అవసరమైన మేర ప్రభుత్వ భూమిని గుర్తించి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పట్టణంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కలెక్టర్ తెలిపారు. ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ రద్దీ రోజురోజుకూ అధికమవుతున్న నేపథ్యంలో ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు ద్వారా ట్రాఫిక్ నియంత్రణను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు. రహదారి భద్రతా చర్యలు, ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ పోలీస్ స్టేషన్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ స్థల పరిశీలన కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, రెవెన్యూ అదనపు కలెక్టర్ అమరేందర్, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, నాగర్ కర్నూల్ ఆర్డిఓ సురేష్ బాబు, తహసిల్దార్ తబితా రాణి, రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు.






