కల్లు సొసైటీలో స్కామ్: మరణించినవారి సంతకాలతో తీర్మానాలు

by Naga Rani Yarlagadda |

మహబూబ్ నగర్ కల్లు సొసైటీ అంటేనే ఓ బంగారు బాతు గుడ్డు. సొసైటీని దక్కించుకున్న వారికి, ప్రజా ప్రతినిధులకు, సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులకు ఓ వరం.

కల్లు సొసైటీలో స్కామ్: మరణించినవారి సంతకాలతో తీర్మానాలు
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ కల్లు సొసైటీ అంటేనే ఓ బంగారు బాతు గుడ్డు. సొసైటీని దక్కించుకున్న వారికి, ప్రజా ప్రతినిధులకు, సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులకు ఓ వరం. ఇటువంటి ఈ సొసైటీని చేజిక్కించుకునేందుకు కొంతమంది ఎత్తులు వేస్తూ అడ్డదారులు తొక్కుతున్నారు. మొత్తం నలుగురు డైరెక్టర్లలో ముగ్గురు ఇప్పటికే మరణించగా వారి సంతకాలను ఫోర్జరీ చేసి కొత్తగా సభ్యులను చేర్చుకునేలా తీర్మానాలు చేస్తూ సంబంధితశాఖ అధికారుల సహకారంతో అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. దాదాపుగా 20 సంవత్సరాల క్రితం ఏర్పాటైన ఈ సొసైటీలో మొదట్లో 70 మందికి పైగా సభ్యులు ఉండేవారు. కేసులు కావడం.. కొంతమంది సభ్యులు మరణించడంతో సభ్యుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. 2024 ఫిబ్రవరి 17వ తేదీన జరిగిన ఎన్నికలలో మొత్తం ఐదుగురు డైరెక్టర్లకు గాను ఐదుగురిని ఎంపిక చేయవలసి ఉండగా.. అర్హులు లేకపోవడంతో కేవలం నలుగురు మాత్రమే ఎంపికయ్యారు. వీరిలో ఒకరు అధ్యక్షుడిగాను మిగతావారు డైరెక్టర్లుగా ఎంపికయ్యారు. మొత్తం 25 మంది సభ్యులతో అప్పటి నుంచి సొసైటీ సజావుగా సాగుతూనే వచ్చింది. ఈ సొసైటీపై ఆధిపత్యం కోసం మరి కొంతమంది ప్రయత్నాలు మొదలుపెట్టి మొత్తం 24 మందిలో ముగ్గురు మరణించగా ఉన్న మెజారిటీ సభ్యులు ఒక గ్రూపు గాను, మరో ఆరుగురు ఒక గ్రూపుగా మారి సొసైటీని దక్కించుకునేందుకు అడ్డదారులు తొక్కుతుండడంతో సభ్యులు ఆధారాలతో అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.

మెజారిటీ పెంచుకునేందుకు..

కల్లు సొసైటీలో ఏర్పడిన రెండు గ్రూపులలో తక్కువ సభ్యులు ఉన్న గ్రూపు తమ ఆధిపత్యం కోసం కొత్తగా సభ్యులను చేర్చుకొని సొసైటీ ఎన్నికలలో గెలుపొంది విక్రయాలు జరుపుకునేందుకు మార్గం సుగమం చేసుకోవాలని ప్రయత్నాలను మొదలుపెట్టారు. సొసైటీపై ఆధిపత్యం సాధించాలి అంటే ప్రస్తుతం ఉన్న ఆరుగురు సభ్యులకు మరో 15 మంది కొత్త సభ్యులను చేర్చుకునేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. మిగతా 15 మంది గ్రూపు సభ్యులు ఒకటిగా ఉండడంతో వారి ఆధిపత్యం లేకుండా సొసైటీని దక్కించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.

ముగ్గురి సంతకాలు ఫోర్జరీ..

కొత్తగా సభ్యులను చేర్చుకోవాలి అంటే ప్రస్తుతం ఉన్న కమిటీ సభ్యుల తీర్మానం ఉండాలి. ఒక అధ్యక్షుడు, ముగ్గురు డైరెక్టర్లలో కనీసం ముగ్గురి సంతకాలు అవసరం అవుతాయి. కానీ ఇప్పటికే మరణించిన ముగ్గురు డైరెక్టర్లు కొత్త సభ్యులను చేర్చుకోవడానికి సంతకాలు చేసినట్లు సృష్టించారు. ఆ తీర్మానాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులకు పంపడంతో వారు కూడా ఆగమేఘాలపై నిబంధనలకు విరుద్ధంగా టెస్టింగ్ చేశారు. మహబూబ్ నగర్ మండలంలో ఈత, తాటి చెట్లు లేకపోవడంలో కోయిలకొండ మండలంలోని ఓ గ్రామానికి తీసుకువెళ్లి చెట్ల దగ్గర నిలిపి వారి ఫొటోలను తీసినట్లు సమాచారం. అన్ని వివరాలతో పైఅధికారుల ఆమోదం కోసం ఫైల్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఫోర్జరీ సంతకాలు, నియమ నిబంధనలకు విరుద్ధంగా కొత్తగా సభ్యులను చేర్చుకునే ప్రక్రియను ఎలా చేపడుతారు అంటూ మిగతా సభ్యులందరూ అధికారులను నిలదీయడంతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. సొసైటీ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న రాజేష్ గౌడ్ 2024 జూన్ 6న, పి దశరథ్ గౌడ్ 2025 ఫిబ్రవరి 11న, జంగమ్మ 2025 ఏప్రిల్ 12న మరణిస్తే సొసైటీలో సభ్యులు ఎవరు ఉన్నారు.. ఎవరు మరణించారు... ఎవరు వైదొలిగారు అని కూడా చూడకుండా అధికారులు ఎలా సంతకాలు చేసి ఫైల్ పుటప్ చేస్తారు అంటూ సభ్యులు ఆందోళనకు సిద్ధం అవుతున్నారు.

విజిట్ చేసినప్పుడు సంతకాలు చేస్తాం - కురుమూర్తి, కో-ఆపరేటివ్ ఇన్స్పెక్టర్

సొసైటీ సభ్యులు సమావేశాలు ఏర్పాటు చేసుకొని తీర్మానాలు చేసుకుంటారు. మేము విజిట్ చేసినప్పుడు వాటిని చదివి సంతకాలు చేస్తాం. డైరెక్టర్లు మరణించిన విషయం మా దృష్టికి రాలేదు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో విషయాలు బయటకు వస్తున్నాయి. పూర్తి వివరాలను అధికారులకు తెలియజేస్తాము.

ఫైలుపై నిర్ణయం తీసుకోలేదు - వీరారెడ్డి,ఎక్సైజ్ సీఐ, మహబూబ్ నగర్

కొత్తగా సభ్యులను చేర్చుకునే విషయములో ఇంకా నిర్ణయం జరగలేదు. పూర్తిస్థాయిలో వివరాలు సేకరించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటాం.

Next Story