- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫలితాలు సాధించాలంటే త్యాగాలు చేయాల్సిందే : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
జీవితంలో ఉన్నత లక్ష్యాలు,ఫలితాలు సాధించాలంటే కష్టపడటమే కాకుండా త్యాగాలు కూడా చేయాల్సి ఉంటుందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : జీవితంలో ఉన్నత లక్ష్యాలు,ఫలితాలు సాధించాలంటే కష్టపడటమే కాకుండా త్యాగాలు కూడా చేయాల్సి ఉంటుందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. జిల్లా కేంద్రం బోయపల్లి రోడ్డులో గల తువ్వ గుట్ట పై ఉన్న వైటీసీ భవనంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 150 మంది పదో తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో 'మహబూబ్ నగర్ ఫస్ట్, వందేమాతరం ఫౌండేషన్ వారు సంయుక్తంగా 'ఐఐఐటీ' కళాశాలలో సీటు సాధించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణా శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే పెద్ద లక్ష్యాలను ఎంచుకొని వాటిని సాధించడానికి క్రమ శిక్షణతో కృషి చేయాలని సూచించారు. విజయాన్ని సాధించాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, పట్టుదలతో చదవడం, లక్ష్యసాధన పట్ల నిబద్ధత కలిగి ఉండటం చాలా అవసరమని అన్నారు.
విద్యార్థులు కేవలం పరీక్షల్లో మంచి మార్కులు సాధించడమే కాకుండా సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. తన గురువు ఎపిజె అబ్దుల్ కలామ్ ను స్మరించుకుంటూ, ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలో ఆయన ఎప్పుడూ చెప్పేవారని, అదే విధంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న తీరు ఆదర్శప్రాయమని ప్రశంసించారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రజాప్రతినిధులు ఉంటే దేశ అభివృద్ధికి ఎలాంటి ఆటంకం ఉండదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహబూబ్ నగర్ లో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే ఒక మంచి ప్రయోగాన్ని ప్రారంభించారని ఆయన అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఐఐఐటీ ప్రవేశాలకు ప్రత్యేక శిక్షణ అందించడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్ భారతదేశానికి ఉత్తమ పౌరులను తయారు చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థులు ఐఐఐటీ లో అత్యధిక సంఖ్యలో సీట్లు సాధించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఇక్కడ నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు విద్యార్థులపై మంచి ప్రభావం చూపుతున్నాయని, వారు క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించగలరని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లా విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలనే సంకల్పం, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా ఉన్నత విద్యలో అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. భవిష్యత్తులో మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం కూడా వారి సూచనలు, సలహాలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, వందేమాతరం ఫౌండేషన్ కో ఆర్డినేటర్ రవీందర్ రెడ్డి, రామకృష్ణ మఠం కోఆర్డినేటర్ రాజా మల్లేష్ పాల్గొన్నారు.






