- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి : టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామరెడ్డి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ను ప్రభుత్వంలో విలీనం చేసి, 'అపాయింటెడ్ డే' ప్రకటించిన తర్వాతే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ.అశ్వద్ధామరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ను ప్రభుత్వంలో విలీనం చేసి, 'అపాయింటెడ్ డే' ప్రకటించిన తర్వాతే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ.అశ్వద్ధామరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్రౌన్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల కార్మికులతో ఏర్పాటు చేసిన టీఎంయూ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తొలుత కార్మిక సంఘాల ఎన్నికలు జరపాలని భావించడం సరియైన నిర్ణయం కాదని, సమ్మెకు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ముందు ప్రభుత్వంలో విలీనం జరగాలని ఆయన పేర్కొన్నారు. సమ్మె కు ముందు కార్మికుల్లో ఏమాత్రం బలం లేని జెఎసి సమ్మె నోటీసు ఇస్తే ప్రభుత్వంలో చలనం లేదని, కార్మిక బలం ఉన్న తమ టిఎంయూ 16 డిమాండ్లతో నోటీసు జారీ చేసి, సమ్మెలోకి వెళ్ళామని, సమ్మె ఉధృతంగా మొదలైన రెండవ రోజే డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మాహుతి చేసుకోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
టీఎంయూ కార్మిక బలంతోనే సమ్మె విజయవంతమైందని, రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్లను అంగీకరించిందని ఆయన అన్నారు. ఇది భరించలేని జెఎసి నాయకులు 'ముందే విలీనం వద్దని, ఎన్నికలు జరపాలని' ప్రభుత్వాన్ని తాను కోరినట్లు విషం ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, కార్మికుల ఉద్యోగ భద్రత, మెరుగైన జీతభత్యాలు, పటిష్టమైన సర్వీస్ కండిషన్లతో తమ యూనియన్ స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్ళుతున్నామని ఆయన అన్నారు. ఆర్టీసీ లో గుర్తింపు సంఘం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కార్మికులంతా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకు ముందు రాష్ట్ర కార్యదర్శి బీఎస్ రెడ్డి మాట్లాడుతూ, 'ముందు ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం , తర్వాతే గుర్తింపు సంఘం ఎన్నికలు' అని ప్రతిపాదించగా సభ ఏకగ్రీవంగా ఆమోదించారు. రీజియన్ అధ్యక్షుడు కె.రవీదర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు, వీసీఎస్ రెడ్డి, రవి, బీవై.రెడ్డి, నారాయణ, శ్రీనివాసులు, భాను ప్రకాష్ రెడ్డి, అన్ని డిపోల కార్యదర్శులు, కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






