- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లకు రైస్ మిల్లర్లు సహకరించాలి : కలెక్టర్ ఖుష్బూ గుప్తా
యాసంగి (రబీ) సీజన్‌లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కొనసాగేందుకు రైస్ మిల్లర్లు జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : యాసంగి (రబీ) సీజన్‌లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా కొనసాగేందుకు రైస్ మిల్లర్లు జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా మిల్లర్లకు ధాన్యం కేటాయింపులో ఎలాంటి సమస్యలు ఉన్నాయో కలెక్టర్ అడిగారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ, యాసంగి సీజన్‌లో కొనుగోలు చేసిన ధాన్యంలో సుమారు 75 శాతం ‘బ్రోకెన్ పాడీ’గా ఉండటం వల్ల మిల్లర్లు నష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కారణంగా ప్రభుత్వం నిర్దేశించిన సివిల్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) లక్ష్యాన్ని పూర్తిగా అందించడం కష్టమవుతోందని చెప్పారు. దీనిపై మిల్లర్లకు కొంత సడలింపు ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే పాడీ ప్రోక్యూర్మెంట్ సెంటర్ల (పీపీసీ) సమీపంలో ఉన్న కొన్ని మిల్లులకు మాత్రమే ఫైన్ ధాన్యం కేటాయిస్తుండగా, ఇతర మిల్లులకు దొడ్డు రకం ధాన్యం కేటాయించడం వల్ల వారు నష్టపోతున్నారని పేర్కొన్నారు. అందరికీ సమాన ప్రాధాన్యతతో ఫైన్, దొడ్డు రకం ధాన్యం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
కొన్ని మిల్లుల వద్ద శుభ్రపరచని ధాన్యం నిల్వ ఉండటం వల్ల కూడా నష్టాలు వస్తున్నాయని చెప్పారు. అదనంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి ప్రభుత్వం గోదాములు ఏర్పాటు చేయాలని, పెండింగ్‌లో ఉన్న మిల్లింగ్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా జిల్లా మేనేజర్ రవి నాయక్ మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 112 రైస్ మిల్లులు ఉండగా, వాటిలో 84 మిల్లులకు సీఎంఆర్ కోసం ధాన్యం కేటాయించామని తెలిపారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ బియ్యాన్ని వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని డిఫాల్ట్ మిల్లర్లను కోరారు. మిల్లింగ్ సామర్థ్యాన్ని బట్టి మిల్లుల జాబితాను అందించాలని, దానికి అనుగుణంగా ధాన్యం కేటాయిస్తామని తెలిపారు. కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ, మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ధాన్యం అన్‌లోడింగ్ కోసం వాహనాలను 3-4 రోజులు నిలిపివేయకుండా చర్యలు తీసుకోవాలని మిల్లర్లను కోరారు. పీపీసీ కేంద్రాలకు గన్నీ సంచుల సరఫరా సమృద్ధిగా ఉండేలా చూడాలని చెప్పారు. రవాణా కాంట్రాక్టర్లు కేటాయించిన మిల్లులకు మాత్రమే ధాన్యం తరలించాలని, నిబంధనలు ఉల్లంఘించకూడదని, వాహనాలకు జియోట్యాగింగ్ ను పరిశీలించాలని సూచించారు. రైతులు సరైన విధంగా ధాన్యం శుభ్రపరిచిన తర్వాతే పిపిసీ కేంద్రాల్లో టోకెన్లు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జెఎల్బీ హరిప్రియ, జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ రవి నాయక్, డిఆర్డీఓ నర్సింహులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.






