జడ్చర్ల లోని తెలంగాణ బొటానికల్ గార్డెన్ లో అరుదైన పుట్టగొడుగు

by Nallavelli.Anjaneyulu |

జడ్చర్ల పట్టణం లో డా. బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అభివృద్ధి చేస్తున్న తెలంగాణ బొటానికల్ గార్డెన్ లో అరుదైన పుట్టగొడుగు దర్శనమిచ్చింది.

జడ్చర్ల లోని తెలంగాణ బొటానికల్ గార్డెన్ లో అరుదైన పుట్టగొడుగు
X

దిశ, జడ్చర్ల : జడ్చర్ల పట్టణం లో డా. బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అభివృద్ధి చేస్తున్న తెలంగాణ బొటానికల్ గార్డెన్ లో అరుదైన పుట్టగొడుగు దర్శనమిచ్చింది. గార్డెన్ లోని నెట్ హౌస్ లో బాదం కాయలు మొలకెత్తడం కోసం ఏర్పాటు చేసిన గోనె సంచుల మీద ఈ పుట్టగొడుగు దర్శనమిచ్చింది. దీనిని కాప్రినొప్సిస్ నివియా గా తాత్కాలికంగా గుర్తించినట్టు గార్డెన్ సమన్వయకర్త డా బి సదాశివయ్య తెలిపారు. దీన్ని గుర్తించడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం వృక్షశాస్త్రం రిటైర్డ్ ప్రొఫెసర్ డా. మనోహరాచారి సహకరించినట్టు సదాశివయ్య తెలిపారు. ఇది తేమతో కూడిన కుళ్ళిన పదార్థాల పైన పెరుగుతూ 1 లేదా 2 రోజుల్లోనే తన జీవితచక్రం ను ముగుస్తుందని పేర్కొన్నారు. దీని ఫలనాంగాలు మంచు రంగులో ఉండి మంచుతో కప్పబడి ఉండటం వల్ల దీనిని స్నోయి ఇంకాంప్ అని సాధారణంగా పిలుస్తారు. దీని ఫలనాంగాలు సుమారుగా 3 సెంటీమీటర్ వరకు పెరిగి ఒక్కరోజులోనే గొడుగువలె మారి నల్లని ద్రవంగా రూపాంతరం చెందుతాయి. భారతదేశం లో ఇప్పటివరకు దీన్ని పంజాబ్, అస్సాం రాష్ట్రాల్లో మాత్రమే గుర్తించారు. దక్షిణ భారత దేశంలో గుర్తించడం ఇదే మొదటిసారని డా. సదాశివయ్య వివరించారు. సదాశివయ్య ను కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి సుకన్య అభినందించారు.

Next Story