పుట్టెడు దుఃఖంతో ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌కు హాజ‌రు

by Ratna Kumari |

త‌న తండ్రి మ‌ర‌ణించడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న‌ప్ప‌టికీ.. ఓ విద్యార్థి బుధ‌వారం ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌కు హాజ‌రై త‌న తండ్రి ఆశ‌యాన్ని నిల‌బెట్టాడు.

పుట్టెడు దుఃఖంతో ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌కు హాజ‌రు
X

దిశ‌, గ‌ద్వాల క్రైం : త‌న తండ్రి మ‌ర‌ణించడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న‌ప్ప‌టికీ.. ఓ విద్యార్థి బుధ‌వారం ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌కు హాజ‌రై త‌న తండ్రి ఆశ‌యాన్ని నిల‌బెట్టాడు. ఈ ఘ‌ట‌న గ‌ద్వాల జిల్లా కేటీదొడ్డి మండ‌లం గంగ‌న్ ప‌ల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌ద్వాల జిల్లా గంగ‌న్ ప‌ల్లి గ్రామానికి చెందిన స‌దానందం ఆచారి(44) మంగ‌ళ‌వారం సాయంత్రం రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు. ఆయ‌న కుమారుడు సాయి విష్ణు ప్ర‌స్తుతం పాత‌పాలెం జిల్లా ప‌రిష‌త్ ఉన్నత పాఠ‌శాల‌లో ప‌దోత‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. తండ్రి మ‌ర‌ణ వార్త విన్న ఆ విద్యార్థి శోక సంద్రంలో ముగినిపోయాడు.


బుధ‌వారం సాయి విష్ణు ప‌దోత‌ర‌గతి వార్షిక ప‌రీక్ష‌ల్లో భాగంగా హిందీ పరీక్ష రాయాల్సి ఉంది. అయితే చ‌దువు పై తండ్రి ఉన్న మ‌క్కువ‌, ఆయ‌న ఎప్పుడూ చెప్పే మాట‌ల‌ను గుర్తు చేసుకున్న సాయి విష్ణు.. తండ్రి మృత‌దేహం ఇంట్లో ఉండ‌గానే బుధ‌వారం ప‌దోత‌ర‌గ‌తి హిందీ ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యాడు. క‌న్నీళ్లు తుడుచుకుంటూ ప‌రీక్ష రాసేందుకు వెళ్లిన ఆ బాలుడిని చూసి తోటి విద్యార్థులు, గ్రామ‌స్తులు క‌న్నీటి ప‌ర్వంత‌మ‌య్యారు. అత‌ని ప‌రీక్ష ముగిసిన వెంట‌నే ఇంటికి చేరుకున్న సాయి విష్ణు.. మ‌ధ్యాహ్నం తండ్రి అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్నాడు. తండ్రి మ‌ర‌ణించిన బాధలో ఉండి కూడా భ‌విష్య‌త్ కోసం ప‌రీక్ష‌కు హాజ‌రైన సాయి విష్ణు ధైర్యాన్ని చూసి స్థానికులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Next Story