ప్రజా సంక్షేమం, పట్టణాలు, గ్రామాల సమగ్ర అభివృద్దే ప్రజా ప్రభుత్వం ధ్యేయం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

by Ratna Kumari |

ప్రజలసంక్షేమం, సర్వతోముఖాభివృద్ధి ప్రజా ప్రభుత్వం ధ్యేయమని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

ప్రజా సంక్షేమం, పట్టణాలు, గ్రామాల సమగ్ర అభివృద్దే ప్రజా ప్రభుత్వం ధ్యేయం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
X

దిశ, వనపర్తి : ప్రజలసంక్షేమం, సర్వతోముఖాభివృద్ధి ప్రజా ప్రభుత్వం ధ్యేయమని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తన సహచర మంత్రివర్యులు రాష్ట్ర పశు సవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి లతోకలిసి వనపర్తి జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. కొత్తకోట, పెబ్బేరు, వనపర్తి పట్టణాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ,ప్రారంభోత్సవాలు చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో రూ.72 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన బాలుర, బాలికల వసతి గృహాలు, కిచెన్ డైనింగ్ హాల్ ను ప్రారంభించారు. రూ. 5 కోట్లతో నిర్మించనున్న జేఎన్టీయూ క్లాస్ రూమ్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశారు. రూ. 1.50 కోట్లతో వనపర్తి పట్టణం మరికుంట లోని గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో డార్మెటరీ, డైనింగ్ హాల్ నిర్మాణం పనులకు, రూ.1.50 కోట్లతో అదే పాఠశాలలో స్టాఫ్ క్వార్టర్స్ కు శంకుస్థాపన చేశారు.

ప‌లు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

పెద్దమందడి గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో రూ.3 కోట్లతో నిర్మించనున్న స్టాఫ్ క్వార్టర్స్, డైనింగ్ హాల్ కు శంకుస్థాపన చేశారు. రూ. 2 కోట్లతో ఘన్ పూర్ లోని గిరిజన సంక్షేమ పాఠశాలలో డార్మెటరీ, డైనింగ్ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వనపర్తి బస్టాండ్ లో విస్తరణ పనుల కోసం రూ.2.50కోట్లతో నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.వనపర్తి మున్సిపాలిటీలో సిసి రోడ్లు మరియు డ్రైనేజీల నిర్మాణం, సహా పలు అభివృద్ధి పనుల కోసం రూ.24 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల భవనంలో రూ.13 కోట్లతో విస్తరణ పనులతోపాటు హాస్టల్ భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమంతో పాటు పట్టణాలు, గ్రామాల సమగ్ర అభివృద్దే ప్రజా ప్రభుత్వం ధ్యేయమని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రంలో పట్టణాలు గ్రామాలు అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధంచేసిందన్నారు.సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో పార్టీలకి అతీతంగా పథకాల అమలు చేసి అందరికి సమ న్యాయ చేస్తున్నామన్నారు.గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేసి 3.70 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు.ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పేదలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు వైద్య సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.తనకు నల్గొండ జిల్లా అంటే ఎంత ప్రేమ ఉందో పాలమూరుపై కూడా అంతే ప్రేమ ఉందని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో సమ్మక్క సరళమ్మ జాతరను కూడా కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తో అదునాతన సౌకర్యాలతో పేద పిల్లలు చదువునే విధంగా నిర్మిస్తున్నామన్నారు. వెనకబడిన జిల్లాల అభివృద్ధి తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. గతంలో పాలమూరు రంగారెడ్డి ని నిర్లక్ష్యం చేసారని విమర్శించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వనపర్తి పట్టణంలోని 33 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కురుమూర్తి జాతరకి రోడ్డు వేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ పండగ అంటే పట్టణాలు, గ్రామాలు అభివృద్ధి చెందితేనే నిజమైన పండగ అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కనీసం మద్దతూ ధరతో పాటు, బోనస్ కూడా ఇస్తున్నామన్నారు.రూ. 110 కోట్లతో కురుమూర్తి జాతరకి రోడ్డు వేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు మంత్రి కోమటిరెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. నోటిఫికేషన్ లు ఇచ్చి 68 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అదేవిధంగా గృహజ్యోతి పథకంతో పేదల గడపల్లో వెలుగులు నింపామన్నారు.ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మాట్లాడుతూ వనపర్తి తో పాటు అన్ని పట్టణాలు గ్రామాల అభివృద్ధి కి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ వనపర్తి ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని చెప్పారు. వనపర్తి నియోజకవర్గం నుంచి కీలక నాయకులు ప్రాతినిత్యం వహిస్తున్నారని అందరం కలిసి కట్టుగా అభివృద్ధి చేస్తామన్నారు. రెండు యేండ్లలో వనపర్తిలో రూ. 3వేల కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన లు చేసినట్లు చెప్పారు. వనపర్తి అభివృద్ధి కి సీఎం అడిగిన వెంటనే నిధులు ఇస్తున్నారన్నారు. పెబ్బేరు లో రూ.47 కోట్లతో ఫిష్ ప్రాసెసింగ్ సెంటర్ మంజూరు చేసిన మంత్రివర్యులు వాకిటి శ్రీహరికి ధన్యవాదములు తెలిపారు. అదేవిదంగా వనపర్తి లో రూ. 81 కోట్లతో కోర్టు కాంప్లెక్స్ తోపాటు రూ. 298 కోట్ల ఆర్ అండ్ బీ రోడ్లు మంజూరు చేసిన మంత్రి కోమటిరెడ్డి కి ధన్యవాదములు తెలిపారు. వనపర్తి బై పాస్ రింగ్ రోడ్ కోసం సహకారం ఇవ్వాలి అని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సంతోష్ పాల్గొన్నారు.

Next Story