- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి సొంతూరులో ఆర్టీసీ బస్టాండ్‌ను వేధిస్తున్న సమస్యలు
రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి సొంత నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ ఆర్టీసీ బస్టాండ్‌ను సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి.

దిశ, మక్తల్: రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి సొంత నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ ఆర్టీసీ బస్టాండ్‌ను సమస్యలు తీవ్రంగా వేధిస్తున్నాయి. వర్షంలో చిన్న చినుకు పడితే చాలు బస్టాండ్ ఆవరణ అంతా జలమయమై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతల్లో నిలిచిన వర్షపు నీరు, హోటళ్ల నుంచి వచ్చే మురుగు నీరు బయటకు వెళ్లే దారి లేక బస్టాండ్ ఆవరణలోనే నిలిచిపోతోంది. దీంతో బస్సులు ఎక్కాలన్నా, దిగాలన్నా ప్రయాణికుల దుస్తులు తడిసిపోక తప్పడం లేదు. నెలకు రూ.లక్షల ఆదాయం సమకూరుస్తున్నా అధికారులు ప్రయాణికుల కనీస సౌకర్యాలను పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
రూ.కోట్ల ఆదాయం ఇచ్చే కేంద్రం..
దాదాపు 40 ఏళ్ల కింద మూడు ఎకరాల విశాలమైన స్థలంలో ఈ బస్టాండ్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ – రాయచూర్ జాతీయ రహదారిపై ఈ బస్టాండ్ ఉండడంతో నిత్యం 200లకు పైగా బస్సులు రాకపోకలు సాగిస్తూ ప్రయాణికులతో కిటకిటలాడుతుంటుంది. ఆర్టీసీ అధికారులు ఐదు గజాల స్థలం కనిపిస్తే చాలు ప్రైవేటు వ్యక్తులకు కిరాయికి ఇచ్చేస్తూ వ్యాపార కేంద్రంగా మార్చేశారు. టిఫిన్ సెంటర్లు, చాయ్ డబ్బాలు, బేకరీలు, షాపింగ్ మాల్స్, భవన నిర్మాణ సామగ్రి నిల్వ చేసేందుకు స్థలాలను అద్దెకు ఇచ్చారు. ఇలా దాదాపు 50 డబ్బాల ద్వారా ఆర్టీసీకి నెలకు రూ.20 లక్షలు, సంవత్సరానికి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు భారీ ఆదాయం సమకూరుతుంది.
అక్రమ ఆక్రమణలు.. ప్రయాణికుల అవస్థలు..
అయితే, స్థలాన్ని అద్దెకు తీసుకున్న వ్యాపారులు ఇచ్చిన పరిమితి కంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి డబ్బాలను విభజించి అంతర్గత కిరాయిలకు ఇస్తూ లబ్ధి పొందుతున్నారు. దీనికితోడు రాజకీయ నాయకులు, ప్రైవేటు సంస్థల ఫ్లెక్సీలు, అనధికారిక సైన్ బోర్డులతో బస్టాండ్ ఆవరణ అంతా ఇరుకుగా మారిపోయింది. ఫలితంగా బస్సులు లోపలికి రాకపోకలు సాగించడానికి డ్రైవర్లు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు ప్రైవేటు వాహనాలు బస్టాండ్ లోపలికి రావడం వల్ల తరచూ చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూ ప్రయాణికులు గాయపడుతున్నారు.
మంత్రి చొరవ చూపాలి..
పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్టాండ్‌లో కూర్చోవడానికి కనీసం బెంచీలు, కుర్చీలు కూడా లేకపోవడంతో మహిళలు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.కోట్ల ఆదాయం వస్తున్నా సదుపాయాలు కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ సమస్యలన్నింటినీ అధికారులతోపాటు మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి, ఆర్టీసీ ఉన్నతాధికారులు చొరవ తీసుకుని జాతీయ రహదారిపై ఉన్న ఈ బస్టాండ్‌ను ఆధునీకరించి ప్రయాణికులకు అవసరమైన వసతులు కల్పించాలని పట్టణ ప్రజలు, అఖిలపక్ష నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.






