తాగునీటి ఎద్దడికి ముందస్తు చర్యలు: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

by I. Sairam |

రాబోయే వేసవి కాలంలో నాగర్‌కర్నూల్ జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు.

తాగునీటి ఎద్దడికి ముందస్తు చర్యలు: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
X

దిశ, కందనూల్: రాబోయే వేసవి కాలంలో నాగర్‌కర్నూల్ జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధ్యక్షతన, అదనపు కలెక్టర్ దేవ సహాయం, మిషన్ భగీరథ ఎస్సీ జగన్ మోహన్, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలిసి జిల్లా తాగునీటి వేసవి ప్రణాళికపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ, ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజినీర్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో తాగునీటి సరఫరాపై విస్తృతంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న వేసవిలో నాగర్‌కర్నూల్ జిల్లాలోని 754 హ్యాబిటేషన్లలో నివసిస్తున్న 2,09,326 కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రోజుకు 100 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రోజుకు 150 లీటర్ల తాగునీరు సరఫరా చేసేలా ప్రణాళిక అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉన్న 1,216 తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయాలని తెలిపారు. తాగునీటి సరఫరా అంశం అత్యంత కీలకమైనదని, క్షేత్రస్థాయిలో ప్రతి రోజూ పకడ్బందీగా పర్యవేక్షణ జరగాలని సూచించారు. ఎక్కడైనా నీటి ఎద్దడి తలెత్తిన వెంటనే యుద్ధప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట చేతిపంపులు, బోరు మోటార్లు, పైప్‌లైన్ మరమ్మతులు సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టాలని సూచించారు.

మున్సిపల్ కార్యాలయాలు, వాటర్ వర్క్స్, గ్రామ పంచాయతీల పరిధిలో టోల్ ఫ్రీ, కాల్ సెంటర్ నెంబర్లు ప్రజలకు తెలిసేలా ఏర్పాటు చేయాలని, మండలాల పరిధిలో ఉన్న నీటి నిల్వలపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని పేర్కొన్నారు. మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు క్షేత్రస్థాయిలో నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

మిషన్ భగీరథ ద్వారా నిర్ణీత పరిమాణంలో నీరు సరఫరా అవుతోందో లేదో మండల అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిర్ధారించుకోవాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేస్తూ ఈ వేసవిలో ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ నీటి సమస్య తలెత్తకుండా నిబద్ధతతో పని చేయాలని సూచించారు. జిల్లా స్థాయి అధికారులు మారుమూల గ్రామాలను సందర్శించి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని ఆదేశించారు.

ప్రస్తుత వేసవి దృష్ట్యా మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, ఎంపీడీఓలు సమిష్టిగా పని చేయాలని తెలిపారు. ఫిబ్రవరి 2వ తేదీ లోపు జిల్లాలోని అన్ని గ్రామాల్లో మంచినీటి మరియు పారిశుద్ధ్య కమిటీలను ఏర్పాటు చేసి, నీటి సరఫరా వ్యవస్థను నిశితంగా పరిశీలించాలని సూచించారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ఈ డ్రైవ్‌లో మండలాల ఎంపీఓలు, మిషన్ భగీరథ ఏఈలు మండల స్థాయి బృందాలుగా ఏర్పడి, సర్పంచ్‌లు, గ్రామ సెక్రటరీలతో కలిసి ప్రతి వీధిని పర్యటించి సమస్యలను గుర్తించి పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. చేపడుతున్న చర్యలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ ఇంట్రా విజయ్ శ్రీ, మిషన్ భగీరథ ఈఈ గ్రిడ్ సుధాకర్ సింగ్ పాల్గొన్నారు.

Next Story