లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన పోస్ట‌ల్ ఇన్ స్పెక్ట‌ర్

by Ratna Kumari |

పెద్ద మొత్తంలో జీతాలు వస్తున్నా.. అంతటితో సంతృప్తి చెందకుండా చేతి వాటం ప్రదర్శించిన వనపర్తి పోస్టల్ సబ్ ఇన్ స్పెక్ట‌ర్ గోపీనాథ్ ను సీబీఐ అధికారులు పట్టుకున్న ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన పోస్ట‌ల్ ఇన్ స్పెక్ట‌ర్
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో/వనపర్తి క్రైమ్ : పెద్ద మొత్తంలో జీతాలు వస్తున్నా.. అంతటితో సంతృప్తి చెందకుండా చేతి వాటం ప్రదర్శించిన వనపర్తి పోస్టల్ సబ్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ ను సీబీఐ అధికారులు పట్టుకున్న ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. క్రింది స్థాయి ఉద్యోగులు అదనంగా చేసే విధులకు రావాల్సిన‌ అదనపు డబ్బులు గత మూడు సంవత్సరాలుగా నిలిచిపోయాయి. ఇటీవల ఉన్నతాధికారులు అదనంగా విధులు నిర్వహించిన ఉద్యోగులకు చెల్లించేందుకు వీలుగా నిధులు మంజూరి చేశారు. ఆ డబ్బులను ఎటువంటి ఆక్షేపణలు లేకుండా చిరు ఉద్యోగులకు చెల్లించవలసిన పోస్టల్ సబ్ ఇన్స్పెక్టర్ , సూపరింటెండెంట్ డబ్బులు మంజూరు చేయాలి అంటే తమకు 30 శాతం డబ్బులు ఇవ్వాలి అని .. అలా అయితేనే డబ్బులు మీ ఖాతాలలో జమ అవుతాయని తేల్చి చెప్పారు.

దాదాపుగా 40 మంది ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చారు. తప్పని పరిస్థితిలో చిరు ఉద్యోగులు సంబంధిత సీబీఐ, పోస్టల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వనపర్తి పోస్టల్ ఇన్ స్పెక్ట‌ర్ గోపీనాథ్ ఒక ఉద్యోగి నుంచి రూ.30వేలు లంచం తీసుకుంటుండగా గురువారం సాయంత్రం దాదాపుగా 12 మంది సీబీఐ అధికారులు పట్టుకునే ప్రయత్నం చేశారు.. ఈ పరిణామాలను పసి గట్టిన పోస్టల్ ఇన్ స్పెక్ట‌ర్ గోపినాథ్ తాను తీసుకున్న డబ్బులను ట్రెజరర్ కు ఇచ్చి ఇవి లెక్కపెట్టమని చెప్పి కార్యాలయం గోడ దూకి ఆటోలో ప‌రార‌య్యాడు. ఫోన్ సిగ్నల్స్ ద్వారా గోపీనాథ్ కొత్తకోట మదనాపూర్ రోడ్డు వద్ద దూర ప్రాంతాలకు వెళ్లడానికి నిలిచి ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తిరిగి వనపర్తి పోస్టల్ కార్యాలయానికి తీసుకువచ్చారు. రాత్రి మొత్తం విచారణ జరిపి శుక్రవారం ఉద‌యం రిమాండ్ కు తరలించారు. పోస్టల్ సూపరింటెండెంట్ పరారీలో ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడిన పోస్టల్ ఇన్ స్పెక్ట‌ర్ గోపీనాథ్ కు బినామీ పేర్ల మీద పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు గుర్తించినట్టు తెలుస్తోంది. మొత్తం పై పోస్టల్ డిపార్ట్ మెంట్ లో జరిగిన వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Next Story