బురదలో బాటసారులు.. బ్రిడ్జి పనుల్లో భద్రత గల్లంతు

by Nallavelli.Anjaneyulu |

అధికారుల పర్యవేక్షణ, పాలకుల పట్టింపు లేకపోవడంతో రేవల్లి-తల్పునూర్ రోడ్డుకు MGKLI కాలువ పక్కన జరుగుతున్న పైప్ బ్రిడ్జి నిర్మాణ పనులు మాత్రం ప్రజలకు సౌకర్యం కంటే కష్టాలను, భద్రత కంటే ప్రమాదాలను మిగులుస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బురదలో బాటసారులు.. బ్రిడ్జి పనుల్లో భద్రత గల్లంతు
X

దిశ‌, రేవ‌ల్లి : అభివృద్ధి పనులు ప్రజల సౌకర్యాలకు అనువుగా అవసరాలను తీర్చేవిధంగా జరగాలి. కానీ అధికారుల పర్యవేక్షణ, పాలకుల పట్టింపు లేకపోవడంతో రేవల్లి-తల్పునూర్ రోడ్డుకు MGKLI కాలువ పక్కన జరుగుతున్న పైప్ బ్రిడ్జి నిర్మాణ పనులు మాత్రం ప్రజలకు సౌకర్యం కంటే కష్టాలను, భద్రత కంటే ప్రమాదాలను మిగులుస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణం పేరుతో ప్రధాన రహదారిని మూసివేసిన గుత్తేదారు, ప్రజల రాకపోకల కోసం సరైన ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయకుండా చేతులు దులుపుకున్నాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ పొలాల వెంబడి తాత్కాలికంగా దారి మళ్లించినా, అది కూడా నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో ప్రజలు నిత్యం ఇబ్బందులకు గుర‌వుతున్నారు.


నిన్న కురిసిన వర్షంతో ఆ పొలాలు పూర్తిగా బురదమయంగా మారాయి. దీంతో గుత్తేదారు మళ్లించిన దారి కూడా బురదలో కూరుకుపోయి, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, చిన్న వాహనాల రాకపోకలు స్తంభించిపోయి. ప్రయాణించే వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు పనుల ప్రదేశంలో హెచ్చరిక బోర్డులు లేవు. ప్రమాద సూచికలు లేవు. రిఫ్లెక్టర్లు, బ్యారికేడ్లు కనిపించవు. రాత్రి వేళల్లో లైటింగ్ ఏర్పాట్లు కూడా చేయలేదు. దీంతో చీకటి పడిన తర్వాత ప్రయాణించే వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజల భద్రతకు సంబంధించిన కనీస నిబంధనలు కూడా పాటించకుండా పనులు సాగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థుల నుంచి వినిపిస్తున్నాయి. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే..? అధికారుల పర్యవేక్షణ, నాణ్యత ప్రమాణాల అమలు, ప్రజా సౌకర్యాల పరిరక్షణ గాలికి వదిలేస్తున్నట్లు,ఈ పరిస్థితులు అధికారుల పాలకుల దృష్టికి వెళ్లినా పెద్దగా స్పందన కనిపించడం లేదు.

ఇబ్బందులు, ప్రమాదాల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ కాంట్రాక్టర్‌కు కొందరు అధికారుల అండదండలు ఉన్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవైపు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం, మరోవైపు ఆ పనుల వల్ల ప్రజలు బురదలో నడవాల్సిన పరిస్థితి రావడం బాధాకరం. అభివృద్ధి అంటే కేవలం నిర్మాణాలు కాదు; ప్రజల భద్రత, సౌకర్యం, జీవన ప్రమాణాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, వెంటనే సరైన ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటు చేయడంతో పాటు, హెచ్చరిక బోర్డులు, బ్యారికేడ్లు, రాత్రి లైటింగ్ వంటి భద్రతా చర్యలు చేపట్టి ప్రజలకు ఉపశమనం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. లేకపోతే ఈ నిర్లక్ష్యం వల్ల జరిగే ఏ ప్రమాదానికైనా బాధ్యత ఎవరిదనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.

Next Story