అనుక్షణం పని చేసే నన్ను ఆదరించి గెలిపించండి : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

by Kalyani |
అనుక్షణం పని చేసే నన్ను ఆదరించి గెలిపించండి : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
X

దిశ, ప్రతినిధి వనపర్తి : అనుక్షణం వనపర్తి నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్న నన్ను మరోసారి ఆదరించి ఆశీర్వదించాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం గోపాల్ పేట మండలం లోని తాడిపత్రి, గోపాల్ పేట, చెన్నూరు, పాటిగడ్డ తండా, ధర్మ తండా, బుద్దారం, జంప్లా తండా, లక్ష్మి తండా, పొల్కేపాడు, కర్ణమయ్య కుంట తండా, లక్ష్మీ దేవిపల్లి, సాకల పల్లి, కేశంపేట, పాత తండా, కొత్త తండా, తలుపు నూర్ తండా, తలుపు నూర్ గ్రామాల్లో మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పట్లో జూరాల ప్రాజెక్టు కట్టడానికి దాదాపు 40 సంవత్సరాలు పట్టిందని అదే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మనం వనపర్తి నియోజకవర్గం లో నిర్మించిన ఏదుల రిజర్వాయర్ ను కేవలం రెండు సంవత్సరాలలో పూర్తి చేసుకున్నామని జూరాలలో ఎన్ని నీళ్లు ఆగుతాయో అన్ని నీళ్లు ఏదుల రిజర్వాయర్ లో ఆగుతాయని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన ప్రాంతంలో మొత్తం మూడు మెడికల్ కళాశాలలు మాత్రమే ఉండేవని అదే కేసీఆర్ సీఎం అయ్యాక జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసుకున్నామని, ఎన్నో విద్యా సంస్థలను ఏర్పాట్లు చేసుకుని నిరుపేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తీసుకు రావడం జరిగిందని చెప్పారు. కొంతమంది కావాలని కులాలను రెచ్చగొడుతున్నారని, తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో అన్ని వర్గాల అభివృద్ధి దిశగా పని చేస్తుందని ఎవరు కూడా ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో వాల్మీకి బోయలు ఎస్టీలుగా ఉన్నప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం వారిని బీసీల్లో చేర్చి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ ఏర్పాటు అయిన తరువాతనే వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని చెల్లప్ప కమిషన్ వేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగిందని, వాల్మీకి పక్షాన నిలబడుతున్నదే తెలంగాణ ప్రభుత్వమని మంత్రి అన్నారు.

వనపర్తి ని జిల్లా చేయడం వల్ల జిల్లా అధికారులు అందరూ అందుబాటులోకి రావడంతో వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో మరోసారి గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ నా రాజకీయ జీవితంలో గోపాల్పేట ప్రజలు తనకు అండగా నిలబడ్డారని నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు ఈ మండలాన్ని మరచిపోనని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్, సాగునీటి కష్టాలు తీరాయి కనుక మరోసారి మంత్రి నిరంజన్ రెడ్డి ని గెలిపించాలని కోరారు.

మంత్రి సమక్షంలో పార్టీలో చేరికలు...

పెద్దమందడి మండలం మణిగిళ్ల గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య అనుచరుడు వాకిటి బాలరాజు తో పాటు 300 మంది ముఖ్య నాయకులు సోమవారం గోపాల్ పేట మండలం పొల్కేపాడు గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరారు. అడ్డాకుల మండలం కనుమనూర్ గ్రామం కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ వాసీమా బేగం ఆధ్వర్యంలో పెద్దమందడి మండలం, పెబ్బేరు మున్సిపాలిటీ నుంచి 100 మంది ముస్లిం మహిళలు గోపాల్ పేట మండలం తాడిపత్రి గ్రామంలో, మండల కేంద్రంలో టీడీపీ నుంచి ఆంజనేయులు తో పాటు 10 మంది నాయకులు, చెన్నూరు గ్రామం లో గౌడ సంఘం నుండి 20 మంది కులస్తులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వెంట మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి నాగం తిరుపతి రెడ్డి, జెడ్పిటిసి మందపాయ్ కోటేశ్వర్ రెడ్డి, ఎంపిపి సంధ్య తిరుపతయ్య, పాల్గొన్నారు.

నియోజకవర్గంలో జోరుగా బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం...

ఖిల్లా ఘనపురం మండలంలో సోమవారం ఉదయం మంత్రి నిరంజన్ రెడ్డి కుమార్తెలు ప్రత్యుష , తేజస్విని స్థానిక నాయకులతో కలిసి తిరుమలాయ పల్లి గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. వనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కారు గుర్తు మీద ఓటు వేసి మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి ప్రజలను కోరారు. సోమవారం పెబ్బేరు మండలం శాఖాపూర్ గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి జరిగిన అభివృద్ధి పనులను ఆమె వివరించారు. ఇక జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి రాకెట్ శ్రీధర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఓ హోటల్ లో ఆయన పూరీలు వేసి అందరినీ ఉత్సాహపరిచారు.

Next Story