ఎన్నికల్లో.. ప్రజలు విజ్ఞత చూపించారు!

by Ravi |
ఎన్నికల్లో.. ప్రజలు విజ్ఞత చూపించారు!
X

ఇటీవల జరిగిన కేంద్ర రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో సాంప్రదాయ మీడియా సంస్కృతికి ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియా కోట్లాది మంది ప్రజలను చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రభావితం చేసింది. దీనికి కారణం మన మీడియా సంస్థలు యాజమాన్యాల కింద పనిచేసే కాకలు తీరిన జర్నలిస్టులు ఏదో ఒక రాజకీయ పార్టీకి లోపాయికారిగా అంతర్గతంగా అవగాహనతో తమ పత్రిక ద్వారా ఛానల్ ద్వారా వార్తలను వండి మార్చడం జరుగుతూ రావడమే. దీంతో ప్రింట్ మీడియాపై, ఎలక్ట్రానిక్ మీడియా వార్తా చానళ్లపై పాఠకులకు, శ్రోతలకు, వీక్షకులకు క్రమక్రమంగా విశ్వాసం సన్నగిల్లుతూ వస్తున్నది.

శాసనకర్తలు చేసే చట్టాలు సామాన్య ప్రజల హక్కులను హరించే దిశగా కొనసాగుతాయి. గందరగోళ పరిస్థితుల కార్యకారణాలన్నీ ఇక్కడే ఉన్నాయి. మరోవైపు ఈ వ్యవస్థలో ప్రధాన భాగమైన మీడియా సర్వసాధారణంగా తన సామాజిక బాధ్యతను మరచి నిష్పాక్షికతను పోగొట్టుకుంటోంది. ప్రజలకు రాజకీయాలకు మధ్య వారధిగా వెలగవలసిన మీడియా హౌస్‌లు ప్రజల వైపు మొగ్గుచూపే బదులు రాజకీయ వ్యవస్థ వైపు నిలబడుతున్నాయి. తద్వారా మీడియా, రాజకీయాలు, ప్రజల మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడింది.

కనుమరుగైన పరిశోధనాత్మక జర్నలిజం

ఈ ఖాళీలోకి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో కొందరు, దేశం పట్ల ప్రజల పట్ల ప్రేమతో బాధ్యతతో సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తమ విశ్లేషణల ద్వారా నిజా నిజాలను కరాకండిగా ఆధారాలతో పాటు ప్రజలకు చేరవేస్తున్నారు. కోట్లాదిమంది సోషల్ మీడియాపై విధేయతను విశ్వాసాన్ని పెంపొందించుకుంటున్నారు. ఒకప్పుడు ప్రింట్ మీడియా పత్రికలు ప్రజల బాధలకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి వాటి పట్ల ప్రభుత్వం దృష్టి సారించడంతో పాటు పరిష్కారం అయ్యేవి. ముఖ్యంగా తెలంగాణలో పత్రికల్లో వార్తా కథనం వచ్చిందంటే ఎన్‌కౌంటర్లు జరగకపౌయేవి. ముద్దాయిలను న్యాయస్థానం ముందు హాజరుపరిచేవారు. విషయాలు చెప్తే ఇక్కడ జర్నలిస్టులు ఆశ్చర్యపోతారు. కానీ పరిశోధనాత్మక జర్నలిజం మెల్లమెల్లగా కనుమరుగు అయ్యింది. పత్రికా రంగం దాని యజమానుల కింద పనిచేసే అన్ని విభాగాలు ప్రభుత్వాధినేతలు, నాయకులు చేసే శంకుస్థాపనల ప్రారంభోత్సవాలకే పరిమితం అయ్యాయి. రాజకీయ పార్టీలకు అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ వ్యవహరించడం జరుగుతూనే ఉంది.

ప్రజలను ఎవరూ మోసపుచ్చలేరు

డిజిటల్ పత్రికల, సోషల్ మీడియా ప్రభావాన్ని గ్రహించి ప్రతి జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాలను నెలకొల్పి ప్రచారానికి లంకించుకున్నారు. ఇవి కూడా ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేదు. అంటే ప్రజలు ఎంతో జాగరూకతతో ఉన్నారని రూఢీ అవుతున్నది. పాలను నీళ్లను వారు దార్శనికతతో వేరు వేరు చేస్తున్నారని తెలుస్తున్నది. ఇటీవల సోషల్ మీడియాలో రవీష్ కుమార్, ధ్రువరాఠీ లాటి జర్నలిస్టులు తమ తమ యూట్యూబ్ చానల్స్ ద్వారా ప్రజాస్వామ్య రక్షణ కోసం కోటానుకోట్ల ప్రజల వద్దకు విలక్షణ వ్యాఖ్యానాలతో వాస్తవాలను ఆధారాలతో చేరవేయడం వల్ల అవి ప్రజలను ప్రభావశీలంగా ఆలోచించేటట్టు చేయడం జరిగింది. దీనికి దర్పణమే తాజా జరిగిన ఎన్నికల ఫలితాలు అని చెప్పవచ్చును.

ప్రజలు విజ్ఞతతో ప్రవర్తిస్తుంటారు.

ప్రస్తుత ఎన్నికల్లో ప్రభుత్వాలకి పత్రికలు మారాయా లేక పత్రికలకు అనుకూలంగా సర్కార్లు మారాయా, యాజమాన్యాల పాలసీలకు అనుకూలంగా జర్నలిస్టులు మారారా? నాలుగు దశాబ్దాల మీడియా ప్రస్థానాన్ని విశ్లేషించుకుంటే చెట్టు ముందా విత్తు ముందా అనే మీమాంస ముందుకు వస్తున్నది. ప్రజలు త్వరగా మరిచిపోతారని, పార్టీల, నాయకుల తప్పులను పట్టించుకోరని మీడియా, రాజకీయ వ్యవస్థలు భావిస్తూ, తాము జనాన్ని ప్రభావితం చేస్తామని అనుకోవడం సహజం. కానీ ప్రజలు ఎవరు ఏమిటో ఎవరు ఎటువైపు నిలబడుతున్నారో తెలుసుకొని అవకాశం రాగానే తిరుగులేని విజ్ఞతతో ప్రవర్తిస్తుంటారు. పాలన ఎక్కడ లోపించిందో ప్రజలు అర్థం చేసుకుంటున్నప్పటికీ, సంబంధిత వ్యవస్థలు మాత్రం కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నాయి.

-జూకంటి జగన్నాథం,

కవి, రచయిత

94410 78095Next Story

Most Viewed