- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రగతి పథంలో పాలమూరు విశ్వవిద్యాలయం
స్థాపించిన ఒకటిన్నర దశాబ్దాల కాలంలోనే పాలమూరు విశ్వవిద్యాలయం అద్భుతమైన ప్రగతిని సాధించిందని రాష్ట్ర

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : స్థాపించిన ఒకటిన్నర దశాబ్దాల కాలంలోనే పాలమూరు విశ్వవిద్యాలయం అద్భుతమైన ప్రగతిని సాధించిందని రాష్ట్ర గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ అన్నారు. గురువారం పాలమూరు విశ్వవిద్యాలయం నాలుగవ స్నాతకోత్సవ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెస్‌ఎన్ ఫార్మా కంపెనీ అధినేత ఎం.సత్యనారాయణరెడ్డికి గౌరవ డాక్టరేటును, 12మంది విద్యార్థులకు పీహెచ్‌డీ పట్టాలు, 83మందికి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు విద్య, విజ్ఞానం, వ్యక్తిత్వాలను రూపొందించే దేవాలయాలని అన్నారు. అటువంటి దేవాలయాలలో ఒకటి అయిన పాలమూరు విశ్వవిద్యాలయంలో నేడు మీ సమక్షంలో నాటకోత్సవ వేడుకలలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
ఇక్కడ పనిచేస్తున్న వైస్ చాన్సులర్, ప్రొఫెసర్లు, సిబ్బంది కృషి, విద్యార్థులు, తల్లిదండ్రుల ఆదరణ వల్ల ఈ విశ్వవిద్యాలయం కొత్త కోర్సులు, మారుతున్న కాలానికి అనుగుణంగా బోధన జరగడం అభినందనీయమని అన్నారు. ప్రధానమంత్రి ఉష పథకంలో భాగంగా రూ.100కోట్ల మంజూరు కావడం అభినందనీయమని గవర్నర్ చెప్పారు. అక్రిటేషన్, మూల్యాంకన వ్యవస్థను మరింత మెరుగుపరచుకోవడం ద్వారా దేశస్థాయిలో మరింత గుర్తింపు పొందాలని గవర్నర్ సూచించారు. ఉన్నత విద్య సామాజిక పరివర్తనకు ఇంజన్ లాంటిదని, ఈ యూనివర్సిటీలో ప్రవేశించి పట్టాలు, మెడల్స్ పొందిన విద్యార్థులు ఈ సమాజానికి తాము ఎంచుకున్న మార్గాల ద్వారా సేవలు అందించాలని సూచించారు. ఈ సమాజం మీ సేవల కోసం ఎదురుచూస్తోంది. మీ అమూల్యమైన సేవలను సమాజానికి అందించాలని గవర్నర్ సూచించారు.
ఈ గడ్డ బిడ్డగా గర్విస్తున్నా : గౌరవ డాక్టరేట్ గ్రహీత మన్నే సత్యనారాయణరెడ్డి
పాలమూరు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ దక్కడం పట్ల ఈ గడ్డ నా పుట్టిన బిడ్డగా ఎంతో గర్విస్తున్న అని ఎంఎస్ఎన్ కంపెనీ అధినేత మన్నె సత్యనారాయణ రెడ్డి అన్నారు. ఈ గడ్డన పుట్టి.. ఇక్కడే చదివి.. విలువలను పెంపొందించుకొని ఒక పారిశ్రామికవేత్తగా ఎదగగలిగానని, మన విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. పట్టాలు, మెడల్స్ అందుకున్న విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో జిల్లాకు, ఈ విశ్వవిద్యాలయానికి ఖ్యాతిని తీసుకువచ్చేలా కృషి చేయాలన్నారు. పాలమూరు విశ్వవిద్యాలయం దాదాపుగా 40వేల మంది విద్యార్థుల హృదయ స్పందనగా మారిందని అన్నారు.
అంచలంచెలుగా అభివృద్ధి : వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్
పాలమూరు విశ్వవిద్యాలయం 2008లో 171ఎకరాలలో స్థాపించబడిందని, ఆ రోజు నుంచి అంచలంచెలుగా ఎదుగుతోందని అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ఏర్పాటైన ఈ యూనివర్సిటీలో ఐదు పీజీ కోర్సులతో ప్రారంభం కావడం జరిగిందన్నారు. ఇంజినీరింగ్, లా కళాశాల, పరిశోధనాలయాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. ప్రపంచంలోని వివిధ యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకొని పరిశోధనలు, రకరకాల శిక్షణలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. వివిధ విభాగాల ద్వారా వస్తున్న నిధులతో యూనివర్సిటీని మరింత గొప్పగా తీర్చిదిద్దుతామని శ్రీనివాస్ తెలిపారు. ఈ స్నాతకోత్సవ వేడుకలలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొనడం, ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఎంఎస్ఎన్ కంపెనీ అధినేత మన్నె సత్యనారాయణ రెడ్డికి గౌరవ డాక్టరేట్, విద్యార్థులకు మెడల్స్, పట్టాలు ప్రధానం చేయడం చరిత్రలో నిలిచిపోయే అంశాలుగా ఆయన కొనియాడారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయేందిరా బోయి, ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, పాలమూరు విశ్వవిద్యాలయం రిజిస్టర్ రమేష్ బాబు, ఐజీఎల్ ఎస్ చౌహన్, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, హెచ్ఓడీలు తదితరులు పాల్గొన్నారు.






